లాక్‌డౌన్ కారణంగా ఎక్కడ కూడా మందు దొరికే పరిస్థితి లేదు. అయితే ఇంతకాలంగా మందు ఎప్పుడు తెరుస్తారా? అని ఎదురు చూస్తున్న మందుబాబులకు శుభవార్త మోసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. త్వరలోనే వైన్ షాపులు తెరిచేందుకు లైన్ క్లియర్ చేసింది. గ్రీన్ జోన్ల పరిధిలో మందుబాబులకు మద్యం దొరికేలా ఏర్పాట్లు చేస్తుంది.
గ్రీన్ జోన్ల పరిధిలో పాన్ షాపులు, లిక్కర్ షాపులు అమ్మకాలు చేపట్టవచ్చని కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసింది. అయితే షాపుల దగ్గర 5 కంటే ఎక్కువ ఉండకూడదు, ఐదుగురు కూడా ఒక్కొక్కరి మధ్య రెండు గజాల దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది. ఈ మేరకు పరిమిత సంఖ్యలో గ్రీన్ జోన్లలో వైన్ షాపులు తెరిచేందుకు తెలంగాణ సర్కార్ కూడా ఏర్పాట్లు చేస్తుంది. ఏఏ ప్రాంతాల్లో ఏ షాపులకు అనుమతి ఇవ్వాలనే అంశంపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది.
కేంద్రం ప్రకటించిన గ్రీన్ జోన్స్‌లో లిక్కర్ షాపులు తెరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు వేస్తుంది. తెలంగాణలో 9 జిల్లాలను గ్రీన్ జోన్స్ గా ప్రకటించింది కేంద్రం. ఈ జిల్లాల్లో మద్యం అమ్మకాలు చేపట్టే అవకాశం ఉంది. నాగర్ కర్నూల్, ములుగు, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, సిద్ధిపేట్, మహబూబ్ నగర్, వనపర్తి, వరంగల్ రూరల్, భువనగరి జిల్లాల్ని కరోనా ఫ్రీ జిల్లాలుగా ప్రకటించింది. ఈ జిల్లాల్లో వైన్ షాపులు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే వైన్ షాపులు తెరిచే అవకాశం ఉంది. ఇక ఏపీలో ఒక్క విజయనగరం జిల్లా మాత్రమే గ్రీన్ జోన్‌లో ఉండగా.. ఆ జిల్లాలో మద్యం అమ్మకాలు జరిగే అవకాశం ఉంది.