Free Bus Travel Scheme: ఏపీలో మరో కొత్త పథకం ప్రారంభం.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. స్త్రీ శక్తి స్కీమ్ కి సీఎం చంద్రబాబు శ్రీకారం
ప్రయాణ సమయంలో ఆధార్, ఓటర్ ఐడీ లేదా రేషన్ కార్డు చూపించాల్సి ఉంటుంది. ఆధార్ లాంటి గుర్తింపు పత్రం చూపగానే..(Free Bus Travel Scheme)

Free Bus Travel Scheme: ఏపీలో మరో కొత్త పథకం ప్రారంభమైంది. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చింది. స్త్రీ శక్తి స్కీమ్ ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఉండవల్లిలో ఓ మహిళకు జీరో ఫేర్ టికెట్ అందించి వారితో కలిసి విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వరకు ప్రయాణించారు. ఈ పథకం కింద 5 రకాల ఆర్టీసీ బస్సుల్లో (పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్, మెట్రో ఎక్స్ ప్రెస్) మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్లు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఈ స్కీమ్ తో ప్రభుత్వంపై ఏటా రూ.1,942 కోట్ల భారం పడనుంది. ఏపీలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలైంది.
స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఏపీలో స్త్రీ శక్తి స్కీమ్ అమల్లోకి వచ్చింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి ఏపీ వ్యాప్తంగా ఉచిత ప్రయాణం మొదలైంది. ఏపీ ఆర్టీసీ మొత్తం బస్సుల్లో 74 శాతం వాటిలో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. మహిళల ఉచిత ప్రయాణం కోసం 8వేల 458 బస్సులు కేటాయించింది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ నివాస హోదా కలిగిన మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ గా ప్రయాణించేందుకు అర్హులు. ప్రయాణ సమయంలో ఆధార్, ఓటర్ ఐడీ లేదా రేషన్ కార్డు చూపించాల్సి ఉంటుంది. ఆధార్ లాంటి గుర్తింపు పత్రం చూపగానే కండక్టర్ నుంచి జీరో ఫేర్ టికెట్ ను పొందొచ్చు.
స్కీమ్ ప్రారంభం సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ లు ఆర్టీసీ బస్సులో మహిళలతో కలిసి ప్రయాణం చేశారు. స్త్రీ శక్తి స్కీమ్ తో ప్రభుత్వంపై నెలకు 162 కోట్ల రూపాయల చొప్పున ఏడాదికి రూ.1942 కోట్ల అదనపు భారం పడనుంది.
ఉండవల్లిలో ఈ పథకాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌తో కలిసి విజయవాడ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. బస్సులో మహిళలతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. అనంతరం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు, పవన్, లోకేశ్ మాట్లాడారు. ఫ్రీ బస్సు స్కీమ్ తో 2.62 కోట్ల మంది మహిళలకు లబ్ధి కలుగుతుంది.
స్త్రీ శక్తి పథకం.. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థికంగా మేలు చేయనుందని సీఎం చంద్రబాబు చెప్పారు. నిత్యం ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం బస్సుల్లో రాకపోకలు జరిపే మహిళలకు ఇకపై ఛార్జీల భారం ఉండదన్నారు.