Transport Vehicle Strike
Transport Vehicle Strike : కేంద్ర ప్రభుత్వం 12ఏళ్లు పైబడిన వాహనాల ఫిట్‌నెస్ చార్జీలను భారీగా పెంచడాన్ని నిరసిస్తూ సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్ (SINTA) ఈనెల 10వ తేదీ నుంచి ఏపీలో సరుకు రవాణా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
తమిళనాడులోని వేలూరులో ఇటీవల సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర రవాణా వాహనాలకు ఫిట్‌నెస్ ఛార్జీలు పెంచుతూ ఉత్తర్వులకు నిరసనగా బంద్ పాటించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలకు చెందిన లారీ యజమానులు పాల్గొన్నారు.
సమావేశంలో నిర్ణయించినట్లుగా డిసెంబర్ 9వ తేదీ అర్ధరాత్రి నుంచి గూడ్స్ రవాణా నిలిపివేయాలని లారీ ఓనర్ల సంఘం నిర్ణయించింది. 13ఏళ్లు దాటిన గూడ్స్ వాహనాలపై కేంద్రం పెంచిన టెస్టింగ్, ఫిట్‌నెస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసింది. అదనపు ఫీజుల భారం సరుకు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. డిమాండ్లను పట్టించుకోకపోతే రైల్వే షెడ్లు, షిప్ యార్డుల్లో 10వేల గూడ్స్ లారీలను నిలిపివేస్తామని హెచ్చరించింది.
రైల్వే గూడ్స్ యార్డులు, షిప్ యార్డులు, పౌరసరఫరాల గోదాముల్లో గూడ్స్ రవాణా నిలిపివేస్తామని అసోసియేషన్ ప్రకటించింది. దీంతో సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలపై ధరల భారం పడనుంది.
ముఖ్యంగా గూడ్స్ రవాణా నిలిచిపోతే ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. పరిశ్రమలకు ముడిసరుకు సరఫరా ఆగిపోతుంది. వ్యాపారాలు దెబ్బతింటాయి. మరోవైపు కూరగాయలు, పండ్లు, రైస్ ట్రాన్స్‌పోర్టు నిలిచిపోయే అవకాశం ఉంది. ఫలితంగా వీటి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.