love marriage effect, Relatives of the bride who set fire to the groom’s house : ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి వధువు బంధువులు వరుడి ఇంటికి నిప్పంటించిన ఘటన అనంతపరం జిల్లా గుంతకల్ మండలం వెంకటాంపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బోయ మల్లికార్జున కూతురు సుమిత్ర గ్రామ వాలంటీర్ గా పని చేస్తోంది. అదే మండలంలోని నాగసముద్రానికి చెందిన నాగప్ప కుమారుడు హేమంత్ ఇంటర్ వరకూ చదివాడు. గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కాలం గడిచే కొద్ది వాళ్లిద్దరి మధ్య ప్రేమ మరింత బలపడింది.
ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. రెండురోజుల క్రితం ప్రేమికులిద్దరూ కలిసి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. హేమంత్ భార్యతో కలిసి ఇంటికి వచ్చాడు. వీళ్ళిద్దరూ ఇక్కడే ఉంటే ప్రమాదమని భావించిన హేమంత్ తండ్రి నాగప్ప కొత్త జంటను వాళ్ళ బంధువుల ఇంటికి పంపాడు. ఈ నేపధ్యంలో అమ్మాయి సుమిత్ర బంధువులు నాగప్ప ఇంటిపైకి దాడికి వచ్చారు. వాళ్లు అక్కడ లేకపోవటంతో ఆగ్రహించి ఇంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు.
ఇది గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే స్పందించి మంటలు ఆర్పివేయటంతో ప్రమాదం తప్పింది. సమచారం తెలుసుకున్న పోలీసులు సుమిత్ర బంధువులను అదుపులోకి తీసుకున్నారు. నాగప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.