Weather Report: అల్పపీడనం అలెర్ట్.. రెండు రోజులు భారీ వర్షాలు!

నేడు, రేపు రెండు తెలుగు రాష్ట్రాలలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో..

Weather Report: నేడు, రేపు రెండు తెలుగు రాష్ట్రాలలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని.. అటు తెలంగాణలో హైదరాబాద్, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

వాయువ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం ఆవరించి.. అది అల్పపీడనంగా మారగా.. అల్పపీడనానికి తోడు పశ్చిమగాలులు వీస్తుండడంతో ఉరుములతో కూడిన జల్లులు కురిసే సూచనలు ఉన్నట్టు తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర , దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల, రాయలసీమలో చాలాచోట్ల వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ప్రత్యేకించి నెల్లూరు, ప్రకాశం, తూర్పు, పశ్చిమగోదావరి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

శుక్రవారం రాత్రి నుండే రెండు తెలుగు రాష్ట్రాలలో పలుచోట్ల వర్షాలు మొదలుకాగా శనివారం పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రెండు రోజుల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు కురుస్తాయని చెప్పింది. కొద్దిరోజులు భారీ వర్షాలు పడటంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. ఇకపై వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలపగా అందుకు తగిన వ్యవసాయ కార్యక్రమాలకు అధికారులు సూచనలు చేయాల్సి ఉంది.

ట్రెండింగ్ వార్తలు