Ap Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి మరో తుపాన్ ముప్పు..! కీలక విషయాలు వెల్లడించిన వాతావరణ శాఖ

AP Rain Alert : ఏపీని వరుస తుపాన్లు వెంటాడుతున్నాయి. ఇటీవల అర్నాబ్, మురసు తుపాన్లు రాష్ట్రంలోని పలు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపించాయి. తాజాగా.. ఏపీని మరో తుపాను ముంచెత్తే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

Andhra Pradesh

AP Rain Alert : ఏపీని వరుస తుపాన్లు వెంటాడుతున్నాయి. ఇటీవల అర్నాబ్, మురసు తుపాన్లు రాష్ట్రంలోని పలు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపించాయి. రైతులు సాగు చేసిన పంటలు నష్టపోవటంతోపాటు.. భారీ ఈదురుగాలులు, వర్షాల కారణంగా పలువురు మృత్యువాత పడ్డారు. ఈ వరుస తుఫానుల కారణంగా భారీ నష్టం వాటిల్లింది. ఇప్పుడిప్పుడే తుపాను ప్రభావిత ప్రాంతాలు కోలుకుంటున్నాయి. ఈ సమయంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలో మరోసారి వర్షాలు దంచికొడతాయని పేర్కొంది.

Also Read : Cold Wave Weather Alert: తెలంగాణలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. వచ్చే మూడ్రోజులు అప్రమత్తంగా ఉండాలి..

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. దక్షిణ అండమాన్‌ సముద్రం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో శుక్రవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అనంతరం ఇది క్రమంగా బలపడే సూచనలు ఉన్నాయని తెలిపింది.

శనివారం నాటికి అల్పపీడనం మరింత స్పష్టమైన అల్పపీడనంగా మారవచ్చని, ఆదివారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ వ్యవస్థ వాయువ్య దిశగా పయనించనున్నట్లు సూచనలు ఉన్నాయి. అయితే ఇది ఏ దిశగా కదులుతుంది? ఎక్కడ ప్రభావం చూపుతుంది? అనే అంశాలపై రానున్న రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

అల్పపీడనం ప్రభావంతో శనివారం నుంచి మంగళవారం వరకు బంగాళాఖాతంలో సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆగ్నేయ, నైరుతి, మధ్య బంగాళాఖాతంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నప్పటికీ, ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌పై దీని ప్రభావం ఉండబోదని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) స్పష్టం చేసింది. అల్పపీడనం బలపడిన తర్వాత దాని ప్రయాణ దిశ, తీవ్రతను బట్టి రాష్ట్రంపై ప్రభావం ఎలా ఉంటుందనే విషయం వెల్లడయ్యే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు అధికారుల హెచ్చరికలను పాటించాలని, వాతావరణ పరిస్థితులపై వచ్చే తాజా సమాచారాన్ని గమనించాలని సూచించారు.