Man Dies With Corona No One Comes For Funeral
corona : ఏదైనా కష్టమొస్తే పల్లెటూళ్లలో అందరూ అయినవారే అవుతారు. అలాంటిది ఆ వ్యక్తి కరోనాతో మరణించాడని తెలియగానే బంధువుల్లో ఒక్కరూ దగ్గరకు రాలేకపోయారు. ఏం చేయాలో తోచని మృతుడి కుటుంబ సభ్యులకు ఇరుగు పొరుగు సూచన ఇచ్చారు. ఆ మేరకు గుంటూరుకు చెందిన స్వచ్ఛంద సంస్థకు సమచారం ఇవ్వగా, వారు వచ్చి మృతదేహాన్ని తరలించిన దయనీయమైన పరిస్థితి మంగళవారం(ఏప్రిల్ 6,2021) రాత్రి మండలంలోని చింతలపూడిలో కనిపించింది.
గ్రామంలో ఒక వ్యక్తి కరోనాతో చనిపోయాడు. అతడికి భార్య ఉంది. మృతి సమాచారం అందుకున్న కుమార్తె, అల్లుడు వచ్చారు. గ్రామంలో మృతుడి బంధువులు, సామాజిక వర్గానికి చెందిన వారు చాలామంది ఉన్నా ఎవరూ రాలేకపోయారు. అండగా ఉండలేక పోతున్నామే అని లోలోపల మనసులో బాధపడినా ఏమీ చేయలేని దుస్థితి.
మరోవైపు కరోన కదా, గ్రామంలో అంత్యక్రియలు ఎందుకని కొందరన్నారు. దీంతో గుంటూరుకు చెందిన అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తుందని తెలిసి గ్రామస్థులే సమాచారం ఇచ్చారు. ట్రస్ట్ నిర్వాహకులు స్వామి జ్ఞానప్రసన్న వెంటనే స్పందించి అంబులెన్స్ పంపారు. అందులో మృతదేహాన్ని గుంటూరుకు అంత్యక్రియలకు తరలించారు. మృతుడి భార్య, కుమార్తె, అల్లుడు కన్నీరుమున్నీరయ్యారు. తమకు ఇంత చేసిన వ్యక్తికి ఏం చేయలేకపోతున్నాం అంటూ గుండెలవిసేలా రోదించడం అందరిని కలచివేసింది.