మీ సేవ కేంద్రాల్లో అందించే సేవలను.. గ్రామ/వార్డు సచివాలయాల్లో అందించేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2019 డిసెంబరు 16న జారీ చేసిన జీవో 22 అమలును హైకోర్టు సస్పెండ్ చేసింది. న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తి మంగళవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వు జారీ చేశారు.
జీవీ22ను సవాల్ చేస్తూ మీ సేవ ఆపరేటర్స్ వెల్ఫేర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యుగంధర్, కడప జిల్లా గ్రామీణ మీ సేవ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేంద్ర బాబు హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. తాము అందించే సేవల్ని గ్రామ సచివాలయాల్లో కల్పిస్తే.. తమ జీవనాధారం దెబ్బ తింటుందన్నారు.
మంగళవారం ఈ వ్యాజ్యాలు న్యాయమూర్తి ముందుకు విచారణకు వచ్చాయి. వివరాలు సమర్పించడానికి సహాయ ప్రభుత్వ న్యాయవాది(ఏజీపీ)గడువు కావాలని కోరారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి పలుమార్లు గడువిచ్చినా.. రెస్పాన్స్ రాలేదని న్యాయస్థానం అంటే లెక్కలేకుండా వ్యవహరిస్తున్నారని ఆగ్రహించారు.