Rain Alert
Rain Alert : ఏపీలో వర్షాలు దంచికొట్టనున్నాయి. పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, అయితే, కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడే సమయంలో బయటకు రావొద్దు.. ఒకవేళ వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
దక్షిణ ఛత్తీస్‌గఢ్ గల్ఫ్ మన్నార్ వరకు తెలంగాణ, రాయలసీమ, అంతర్ తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రెండు రోజులపాటు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు.
Also Read: Cough Syrup: దగ్గు సిరప్‌తో 20 మంది చిన్నారులు మృతి.. కేంద్రం కీలక ఆదేశాలు..
ఇవాళ (గురువారం) పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడనుంది. మధ్యాహ్నం 2గంటల తరువాత ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన ఉంది. అది కంటిన్యూగా రాత్రి 10గంటల వరకు ఉంటుంది. అలాగే కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సాయంత్రం 4గంటల నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే చాన్స్ ఉంది. అర్ధరాత్రి తరువాత భారీ వర్షం పడే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఇవాళ అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వర్షాలతో పాటు పిడుగులు కూడా పడే ప్రమాదం ఉండడంతో రైతులు, మత్స్యకారులు అదనపు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
బుధవారం మధ్యాహ్నం నుంచి విశాఖపట్టణం జిల్లాలోని పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. ఉరుములుతో కూడిన పిడుగులు పడటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మధురవాడ జలమయం అయింది. గోపాలపట్నం, పెందుర్తి, మహారాణిపేట, భీమునిపట్నం తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. మరోవైపు.. విజయవాడలో కూడా భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి.