Rain Alert in AP : ఏపీకి రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో ఐదు రోజులు దంచికొట్టనున్న వానలు.. వాతావరణ శాఖ కీలక సూచనలు
Rain Alert in AP : డిశా రాష్ట్రం నుండి ఏపీ మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఒక ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. ఈ కారణంగా ఏపీలో వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
- Harish Thanniru
- Published on- May 2, 2026 / 09:25 AM IST
Rain Alert in AP
- ఏపీకి రెయిన్ అలెర్ట్
ఈ జిల్లాల్లో ఐదు రోజులు వర్షాలు కురిసే చాన్స్
వాతావరణ శాఖ కీలక సూచనలు
Rain Alert in AP : ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో 45డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఎండల తీవ్రత ఉంటుండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. అయితే, ప్రస్తుతం వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవిస్తున్నాయి. వచ్చే ఐదు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఒడిశా రాష్ట్రం నుండి ఏపీ మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఒక ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. ఈ కారణంగా ఏపీలో వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మిశ్రమ వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పగలు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. సాయంత్రం వేళల్లో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, వచ్చే ఐదు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో 65కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు.
ద్రోణి ప్రభావం కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలతోపాటు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో తీర ప్రాంత ప్రజలు బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వర్షాల సమయంలో చెట్ల కింద ఉండొద్దని, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో వేచిఉండొద్దని అధికారులు సూచించారు.
వచ్చే ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ఈ మేరకు జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేసింది. అకస్మాత్తుగా కురిసే వర్షాల వల్ల కలిగే నష్టాన్ని నివారించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఇదిలాఉంటే.. ప్రస్తుత ఉపరితల ద్రోణి కారణంగా ఆకాశం నిరంతరం మేఘావృతమై ఉంటుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ మార్పుల వల్ల మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లడం శ్రేయస్కరం కాదని వారు సూచించారు.
ఎండల తీవ్రతతోపాటు అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తలు నిర్వహణ సంస్థ సూచించింది. ప్రస్తుతం రైతుల పంటలు కోత దశలో ఉన్నాయి. వరి, మొక్కజొన్న, మిరప పంటలతోపాటు పలు రకాల పంటల ఉత్పత్తులు కోత దశలో ఉండగా.. కొన్ని ప్రాంతాల్లో పంటల ఉత్పత్తులు కల్లాల్లోకి చేరాయి. ఇలాంటి పరిస్థితుల్లో అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పంట ఉత్పత్తులను కాపాడుకునేందుకు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు.
