AP Rains : ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం.. ఇవాళ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్.. హెచ్చరికలు జారీ..
AP Rains : ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. అది క్రమంగా తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయి.
- Harish Thanniru
- Published on- May 13, 2026 / 06:44 AM IST
AP Rains
- బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం
- ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
- ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ
AP Rains : ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు వేసవి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఎండల తీవ్రతతోపాటు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు.. వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ ఈదురుగాలులతోపాటు పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. అది క్రమంగా తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర తమిళనాడు, రాయలసీమ, కర్ణాటక మీదుగా మరాఠ్వాడా వరకు ద్రోణి విస్తరించి ఉంది. ఈ కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలతోపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ద్రోణి ప్రభావంతో బుధవారం అల్లూరి సీతారామరాజు, పోలవరం, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ ఈదురు గాలులు, పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షాలకుతోడు ఎండల ప్రభావం కూడా ఉంటుందని అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు ఎండల తీవ్రత నుంచి అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
ఏపీలోని కర్నూల్ జిల్లా నగరడోనలో 42.9 డిగ్రీల గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. అదేవిధంగా నంద్యాల జిల్లా కొత్తపల్లెలో 42.4, పోలవరం జిల్లా ఎర్రంపేటలో 42డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం కూడా పలు జిల్లాల్లో 42డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి, ముంచింగిపుట్టు, పెదబయలు, పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, గుర్తేడు మండలాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది.
వర్షాల సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని, ఉరుములు శబ్దాలు వినిపించిన వెంటనే సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. వర్షాల సమయంలో, ఈదురుగాలుల సమయంలో పాత భవనాలు, భారీ హోర్డింగ్స్, విద్యుత్ స్తంభాల వద్ద, చెట్ల కింద ఉండొద్దని, రైతులు, వ్యవసాయ కూలీలు పొలాల్లో పనిచేస్తున్న సమయంలో ఉరుముల శబ్దాలు వినిపిస్తే వెంటనే సరక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే చాన్స్ ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రైతులు తమ పంటల ఉత్పత్తులను కాపాడుకునేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
