AP Rain Alert : ఏపీలో ఈ జిల్లాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ..
AP Rain Alert : ఏపీలో వచ్చే మూడ్రోజులు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
- Harishth Thanniru
- Published On : March 20, 2026 / 08:56 AM IST
AP Rain Alert
- ఏపీలో వచ్చే మూడ్రోజులు వర్షాలు
- పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ సూచన
AP Rain Alert : ఏపీలో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతోపాటు పిడిగులతో కూడిన వర్షాలు పడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే, వచ్చే మూడ్రోజులుకూడా ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
Also Read : Traffic Rules : వాహనదారులకు బిగ్ అలర్ట్.. చలాన్లు చెల్లించడం లేదా.. అయితే, మీకు ఇబ్బందులు తప్పవ్..
ఆంధ్రప్రదేశ్ తీర పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి సగటున 3.1కిమీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తమిళనాడు మీదుగా దక్షిణ అంతర్గత కర్నాటక వరకు ద్రోణి విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అదేవిధంగా రేపు (శనివారం) ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆదివారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఈదురుగాలులు, వర్షాలు పడే సమయంలో ప్రజలు బయటకు వెళ్లొద్దని, ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పొరపాటున కూడా చెట్ల కింద ఉండొద్దని, ఇది ప్రాణాప్రాయానికి దారితీస్తుందని తెలిపారు. ఈదురుగాలులు సమయంలో హోర్డింగ్‌లు, విద్యుత్ స్తంభాల వద్ద.. విద్యుత్ తీగలు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని అధికారులు సూచించారు.
రబీలో రైతులు సాగుచేసిన పంటలు ప్రస్తుతం చేతికొచ్చే దశలో ఉన్నాయి. పలు ప్రాంతాల్లో పంట ఉత్పత్తులు కల్లాల్లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే, వర్షాల నేపథ్యంలో అన్నదాతలు పంటల ఉత్పత్తులను కాపాడుకునేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
