Rain Alert
Rain Alert : ఏపీలోని ప్రజలకు వాతావరణ కేంద్రం కీలక అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న రెండురోజులు ఏపీలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. దీనికితోడు ఉత్తరాధి నుంచి వస్తున్న చలిగాలులు వల్ల ద్రోణి వాతావరణం ఏర్పడి.. కొనసాగుతోంది. ఈ కారణంగా ఇవాళ ఏపీలో ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Also Read : విశాఖలో వైసీపీని నడిపించేదెవరు? ఎందుకీ పరిస్థితి?
ద్రోణి ప్రభావంతో గురువారం శ్రీకాకుళం, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కూడా కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉంటుందని.. మధ్యాహ్నం నుంచి సాయంత్రం సమయంలో వాతావరణం మేఘావృతమై ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
బుధవారం ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం దంచికొట్టింది. విశాఖపట్టణం జిల్లా పెందుర్తి మండలంలోని పలు ప్రాంతాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం నుంచి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అనకాపల్లి జిల్లా సుబ్బరం మండలం గుల్లేపల్లి అవెన్యూ స్పోర్ట్స్ అవేరా క్రికెట్ మైదానం వర్షానికి పూర్తిగా జలమయమైంది. దీంతో అక్కడ జరుగుతున్న క్రీడా పోటీలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇవాళ కూడా ఏపీలోని పలు జిల్లాల్లో అదే పరిస్థితి ఉంటుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా రైతులకు తీవ్ర నష్టం వాటిళ్లుతుంది. ప్రస్తుతం రబీ పంటలు చేతికొచ్చే సమయం.. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, మిర్చి వంటి పంటలు చేతికందే దశలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షాల కారణంగా పంట పొలాల్లోని పంట నేలవాలుతుంది. దీంతో చేతికొచ్చిన పంట దెబ్బతింటుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇవాళ, రేపు కూడా ఏపీలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని.. రైతులు కల్లాల్లో ఆరబోసిన పంట ఉత్పత్తులకు రక్షణ కల్పించుకునేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వర్షాలు పడే సమయంలో చెట్ల కింద ఉండొద్దని అధికారులు సూచించారు.