Rain Alert : ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో నేడు, రేపు పిడుగులతో కూడిన వర్షాలు.. సాయంత్రం వేళల్లో బయటకు రావొద్దు..
Rain Alert : ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
- Harishth Thanniru
- Published On : March 22, 2026 / 08:17 AM IST
AP Rains
- ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు పడే చాన్స్
- పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు
Rain Alert : ఏపీలో గత నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ బంగాళాఖాతం సమీప ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ కారణంగా వర్షాలు పడుతున్నాయి. అయితే, ఇవాళ, రేపు కూడా వర్షాలు దంచికొట్టనున్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి వేళల్లో ఈదురుగాలులతో బీభత్సమైన వాతావరణంకు అవకాశం ఉందని, ప్రజలు ఆ సమయాల్లో బయటకు రావొద్దని వాతావరణ శాఖ సూచించింది.
ఏపీలోని పలు జిల్లాల్లో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా.. ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో విజయనగరం, విశాఖపట్టణం, కృష్ణా, గుంటూరు, బాపట్ల వంటి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రాయలసీమ జిల్లాలైన నంద్యాల, అనంతపురం, కర్నూలు ప్రాంతాల్లో మధ్యాహ్నం ఎండల తీవ్రత కొనసాగినా.. సాయంత్రం, రాత్రి వేళల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈదురుగాలులు లేదా వర్షాలు పడే సమయంలో బయటకు రావొద్దని, ఒకవేళ వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, చెట్ల కింద, హోర్డింగ్ ప్రాంతాల్లో, విద్యుత్ స్తంభాల వద్ద ఉండొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
ఏపీలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు సాగుచేసిన పంటలు దెబ్బతింటున్నాయి. వర్షాలతోపాటు ఈదురుగాలులు వీస్తుండటంతో పొలాల్లో పంట నేలవాలుతోంది. అరటి, మొక్కజొన్న, మిర్చి, వరి, మినుము, పసుపు పంటలతో పాటు మామిడి రైతులకు ఈ అకాల వర్షం వల్ల నష్టం వాటిల్లితోంది. దీంతో నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
