Adimulapu Suresh : ఒక్క స్కూలు కూడా మూతపడదు, ఏ టీచర్ పోస్టు తగ్గదు

Adimulapu Suresh : ఏపీలో నూతన విద్యావిధానం అమలుపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నూతన విద్యావిధానం(5+3+3+4) తప్పనిసరిగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక నూతన విద్యావిధానం అమలుతో నెలకొన్న భయాలపైనా ఆయన క్లారిటీ ఇచ్చారు. కొత్త విద్యావిధానం అమలుతో ఒక్క స్కూల్ కూడా మూతపడదని చెప్పారు. అంతేకాదు ఏ టీచర్ పోస్టు కూడా తగ్గదని వెల్లడించారు. నూతన విద్యావిధానంపై ప్రతిపాదనలు వారం రోజుల్లో ఖరారు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అటు రెండేళ్లలో ఫౌండేషన్ స్కూళ్లకు అదనపు గదుల నిర్మాణం జరుగుతుందని మంత్రి తెలిపారు.

నూతన విద్యా విధానం అమలుతో పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుందన్నారు. విద్యాశాఖలో రెండు వేల బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రి చెప్పారు. ఆన్‌లైన్‌ విద్యాబోధనకు రెండు వర్సిటీలను ఎంపిక చేశామన్నారు. విద్యాదీవెన పథకంలో భాగంగా రాష్ట్రంలో 35 లక్షల మంది విద్యార్థులు ల్యాప్‌టాప్‌లు కావాలని ఐచ్ఛికంగా కోరినట్లు మంత్రి తెలిపారు. ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు అన్ని చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.

మరోవైపు ఆగస్టు 16 నుంచి రాష్ట్రంలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నట్లు మంత్రి సురేష్ తెలిపారు. ఈనెల 12 నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయన్నారు. విద్యాశాఖలో నాడు-నేడుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.కొవిడ్ కేసులు పెరిగితే స్కూల్స్ రీ ఓపెన్‌పై మళ్లీ సమీక్షిస్తామన్నారు. నెలాఖరు లోపు ఇంటర్ విద్యార్థులకు మార్కుల మెమోలు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఆగస్ట్‌లోపు నాడు-నేడు పెండింగ్ పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. జూన్ 15-ఆగస్టు 15 వరకు వర్క్‌బుక్స్‌లపై టీచర్లకు శిక్షణ ఉంటుందన్నారు.

ట్రెండింగ్ వార్తలు