Kinjarapu Atchannaidu: వైఎస్ఆర్ మరణం వెనుక..- జగన్ పై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు

తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టాలని తల్లి అడిగితే తల్లిని కూడా బయటకు పంపిన నైజం జగన్ మోహన్ రెడ్డిది. రోశయ్య చెప్పినా.. బొత్స చెప్పినా.. మాకు అనుమానాలున్నా మేం నిజం కాదేమో అనుకున్నాం.

  • Published On : April 9, 2026 / 04:30 PM IST

Kinjarapu Atchannaidu: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ మరణానికి జగన్ మోహన్ రెడ్డే కారణమనే అనుమానాలు నిర్ధారణ అవుతున్నాయన్నారు మంత్రి అచ్చెన్న. జగన్ నైజం చూస్తుంటే నాడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు నిజమే అని అనిపిస్తోందన్నారు. వైఎస్ఆర్ చనిపోయినప్పుడు, వివేకా చనిపోయినప్పుడు లాభం పొందిన వ్యక్తి జగన్ ఒక్కరే అని మంత్రి అచ్చెన్న అన్నారు. పదవి కోసం సైకో మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారంటూ జగన్ పై విరుచుకుపడ్డారు. జగన్ కి ఇక అధికారం రాదని ఆయన జోస్యం చెప్పారు. ప్రజలకు జగన్ పిచ్చి చేష్టలు తెలిసిపోయాయని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్రలో ఏం చేశామో కాలికి గజ్జె కట్టుకుని చెబుతానని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

రాష్ట్రం మీద, తెలుగు ప్రజల మీద జగన్ కి ఎందుకింత కక్ష?

”ఒక వ్యక్తి ప్రవర్తన వల్ల కుటుంబాలు, సమాజం ఎలా విధ్వంసం అవుతాయో అనే దానికి జగన్ బెస్ట్ ఎగ్జాంపుల్. 2014-19 మధ్య కాలంలో రాష్ట్రంలో స్వర్ణయుగం లాంటి పాలన సాగింది. 2019-24 మధ్య కాలంలో ఒక్క ఛాన్స్ అంటూ జగన్ అధికారంలోకి వచ్చి విధ్వంసం చేశారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 22 నెలల కాలంలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టాం. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానికి సంపూర్ణ సహకారం అందించడం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి-సంక్షేమం అమలు చేస్తున్నాం. రాష్ట్రం మీద, తెలుగు ప్రజల మీద జగన్ కి ఎందుకింత కక్ష?

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధి జరిగేలా పరిపాలన సాగిస్తున్నాం. పరిశ్రమలు తెస్తున్నాం, ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపడుతున్నాం. సీమకు నీళ్లు ఇస్తున్నాం. ఇంత మంచి జరుగుతుంటే రాష్ట్రం మీద జగన్ కక్ష పెట్టుకున్నట్టు వ్యవహరిస్తున్నారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యే నాటికి ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితి అందరికీ తెలిసిందే. తండ్రిని అడ్డం పెట్టుకుని జగన్ డబ్బులు సంపాదించారనే విషయం కూడా అందరికీ తెలుసు. తండ్రిని కూడా జగన్ మానసిక క్షోభకు గురి చేశారు. రాష్ట్రంలో జగన్ ఉంటే తనకు, రాష్ట్రానికి నష్టమని నాడు వైఎస్సార్ ఆయనను బెంగళూరుకు పంపారు. ఈ విషయం రోశయ్యే చెప్పారు.

రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని జగన్ కలలు కన్నారు..

రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని జగన్ కలలు కన్నారు. వైఎస్ ఉంటే తాను సీఎం కాలేరు. 2009లో వైఎస్సార్ తిరిగి సీఎంగా ఎన్నికయ్యారు. చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్తే హెలికాప్టర్ మిస్ అయింది. అందరూ ఆందోళనలో ఉన్నారు. నాడు చంద్రబాబు కూడా టెలీకాన్ఫరెన్స్ తీసుకుని ఏమైనా సమాచారం లభ్యమవుతుందేమో చూడాలని మాకు చెప్పారు. వైఎస్సార్ చనిపోయిన సమయంలో జగన్ ఇతర రాష్ట్రాల్లో ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది..? వైఎస్సార్ చనిపోయిన రోజునే పోలవరం టెండర్లను ఆన్ లైన్ లోకి ఎక్కించాల్సిన అవసరం ఏమొచ్చింది..? ఇంకా వైఎస్ మరణం నిర్ధారణ కాకముందే సీఎం పదవి కోసం జగన్ సంతకాల సేకరణ చేపట్టారు. వైఎస్ మరణం మీద చాలా మంది నాడే అనుమానాలు వ్యక్తం చేశారు. వైఎస్ మరణం వెనుక జగన్ హస్తం ఉందని ప్రస్తుతం వైసీపీలో ముఖ్యనేతగా ఉన్న బొత్స కామెంట్ చేశారు. ఆరోజు మేం నమ్మలేదు. సభ్య సమాజంలో ఇలా ఎందుకు చేస్తారని అనుకున్నాం.

అధికారం కోసం సొంత బాబాయినే..

కానీ సైకోకు పదవీ వ్యామోహం ఉంటే తండ్రిని, తల్లిని, చెల్లిని, బాబాయినైనా వదలరని ఇప్పుడు జగన్ ప్రవర్తన చూస్తుంటే అర్థమవుతోంది. వైఎస్ మరణానికి రిలయన్స్ సంస్థ కారణం అంటూ ఆ సంస్థల మీద జగన్ దాడులు చేయించారు. తిరిగి వాళ్లకే రాజ్యసభ కట్టబెట్టారు. 2014లో తండ్రి మరణం నుంచి సింపతీ పొంది ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించారు. 2019లో అధికారం కోసం సొంత బాబాయిని చంపారు. అధికారం దక్కించుకున్నారు. వివేకాను ఎవరు చెప్పారంటే రాష్ట్రంలో ఏ చిన్నపిల్లవాడిని అడిగినా చెబుతారు. ఇప్పుడు తల్లి, చెల్లి కూడా జగన్ అసలు నైజం గురించి చెబుతున్నారు.

తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టాలని తల్లి అడిగితే తల్లిని కూడా బయటకు పంపిన నైజం జగన్ మోహన్ రెడ్డిది. రోశయ్య చెప్పినా.. బొత్స చెప్పినా.. మాకు అనుమానాలున్నా మేం నిజం కాదేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవన్నీ నిజమేనని అనిపిస్తోంది.
సైకోకు పదవీ వ్యామోహం వస్తే ఎలా ఉంటారో జగన్ మోహన్ రెడ్డిని చూస్తే అర్థమవుతుంది. రాష్ట్రం ఎలా ఉన్నా… కుటుంబం ఎలా ఉన్నా… సమాజం ఎలా ఉన్నా జగన్ కు ఫర్వాలేదు. అతనికి పదవే ముఖ్యం. నిలకడలేని వ్యక్తిత్వం ఉన్న వాళ్లని సైకో అంటారు.

సీఎం పదవి కోసం కాంగ్రెస్ మీద దాడి చేశారు. బెయిల్ కోసం సోనియా కాళ్ల మీద పడ్డారు. రాష్ట్రానికి రాజధానిగా అమరావతికి అంగీకారం తెలిపారు. అమరావతిలో ఇల్లు కట్టుకున్నానని చెప్పారు. అధికారంలోకి వచ్చాక అమరావతిని పక్కన పడేసి మూడు రాజధానులని చెప్పారు. ప్రాంతాల మధ్య, కులాల మధ్య తగువు పెట్టడం జగన్ నైజం. మూడు ప్రాంతాల ప్రజలు వైసీపీకి కర్రు కాల్చి వాత పెట్టారు.

మావిగన్ పేరుతో మూడు జిల్లాల మధ్య తగువు పెడుతున్నారు..

ఇప్పుడు మావిగన్ అనే ప్రతిపాదన తెచ్చారు. అప్పుడు మూడు ప్రాంతాల మధ్య తగువు పెట్టారు. ఇప్పుడు మూడు జిల్లాల మధ్య తగువు పెడుతున్నారు. వైసీపీలో ఉన్న వాళ్లు కూడా మావిగన్ ప్రతిపాదనపై ఎగతాళి చేస్తున్నారు. సిగ్గు లేకుండా మావిగన్ అంటూ జగన్ చేసిన ప్రతిపాదన పై నవ్వుకుంటున్నారు. జగన్ మోహన్ రెడ్డి తరహాలోనే ఆ పార్టీలోని కొందరు సీనియర్లు తయారయ్యారు. పీసీసీ అధ్యక్షులుగా చేసిన వారు, మంత్రులుగా చేసిన వారు జగన్ కి వంత పాడుతున్నారు. నిన్నటి వరకు జగన్ మాత్రమే పిచ్చొడనుకున్నాం. కానీ ఆ పార్టీలో కొందరు పెద్ద పిచ్చోళ్లల్లా తయారయ్యారు. ఇప్పుడు మావిగన్ అంటున్న జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకారు..?

పూటకో మాట అన్నట్టగా పదవీ వ్యామోహంతో సైకోగా వ్యవహరిస్తున్నారు. వైఎస్ చనిపోయినప్పుడు, వివేకా చనిపోయినప్పుడు లాభం పొందిన వ్యక్తి జగన్ ఒక్కరే. తండ్రి మరణంతో సింపతీతో పార్టీ పెట్టారు. వివేకా మరణంతో సీఎం అయ్యారు. తండ్రి-బాబాయి చావులతో జగన్ ఒక్కడే లబ్ది పొందారు.
ఆడవాళ్ల గురించి మాట్లాడే హక్కు జగన్ కు ఉందా? అక్రమ సంపాదనతో రాధాకృష్ణ పత్రిక పెటలేదు. జర్నలిస్టుగా ఉండి పత్రిక పెట్టారు. ఆర్కే మాట్లాడింది తప్పు అని ఖండించవచ్చు. న్యాయస్థానానికి వెళ్లొచ్చు. అమరావతి మహిళలను వేశ్యలుగా అవమానించారు. మా తల్లి లాంటి భువనేశ్వరి గారి మీద వ్యాఖ్యలు చేయలేదా? ఆఖరికి సొంత చెల్లి షర్మిల అసలు రాజశేఖర్ రెడ్డికే పుట్టలేదని సోషల్ మీడియాలో మాట్లాడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞతతో ఉంటారు… ప్రజలకన్నీ తెలుసు.

అమరావతిని మార్చేలా తొలి సంతకం చేస్తామంటూ పిచ్చి కామెంట్లు..

పోలీస్ స్టేషన్లు తిప్పుతాడట. ఇవన్నీ మేం చూసేశాం. 2019లో నువ్వు చేసిన దారుణాలివే కదా. మళ్లీ వస్తాం.. అమరావతిని మార్చేలా తొలి సంతకం చేస్తామంటూ పిచ్చి కామెంట్లు చేస్తున్నారు. సమాజానికి జగన్ మోహన్ రెడ్డి ఓ చీడ పురుగు. ఇష్టానుసారంగా అవాస్తవాలు మాట్లాడుతున్నారు.
ప్రజలు ఈ పరిణామాలను గమనించాలి. ఒక్క వ్యక్తి తన పదవి కోసం ఎంత మందిని పొట్టన పెట్టుకున్నారో ప్రజలంతా గమనించాలి” అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

Also Read: రాజధానిపై వైసీపీ లీడర్ల మల్టీపుల్ వెర్షన్స్..! ఎందుకీ డైలమా.. కన్‌ఫ్యూజనా? స్ట్రాటజీనా?