దమ్ము, ధైర్యం ఉంటే ఎన్నికల్లో పోటీ చెయ్యాలి.. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డకు మంత్రి కొడాలి నాని సవాల్

  • Publish Date - November 18, 2020 / 11:09 AM IST

kodali nani local body elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు మంటలు రాజేస్తున్నాయి. రాజకీయంగా వేడిని పుట్టిస్తున్నాయి. ఎన్నికల నిర్వహణకు సిద్ధం అని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటుంటే, ప్రభుత్వం మాత్రం నో అంటోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్పందించిన మంత్రి కొడాలి నాని.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

చంద్రబాబు తొత్తు నిమ్మగడ్డ రమేష్:
చంద్రబాబు లేఖలకు స్పందిస్తూ నిమ్మగడ్డ రమేష్.. ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సిగ్గు చేటు అన్నారు మంత్రి కొడాలి నాని. నిమ్మగడ్డకు రాజ్యాంగ వ్యవస్థలు, రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదన్నారు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న నిమ్మగడ్డ రాజకీయాలు మాని, హుందాగా వ్యవహరించాలని మంత్రి కొడాలి నాని హితవు పలికారు. చంద్రబాబుకి తొత్తుగా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ రాజీనామా చెయ్యాలని మంత్రి డిమాండ్ చేశారు. అంతేకాదు దమ్ము, ధైర్యం ఉంటే పదవి పోయాక ఎన్నికల్లో పోటీ చేయాలని నిమ్మగడ్డ రమేష్ కు మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు.

ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా లేదు:
కరోనా నేపథ్యంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా లేదని మరోసారి మంత్రి కొడాలి నాని తేల్చి చెప్పారు. కొవిడ్ తీవ్రత దృష్ట్యా ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధంగా లేరని ఆయన అన్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తే వైరస్ వ్యాప్తికి కారణం అవుతుందని మంత్రి కొడాలి నాని చెప్పారు.

జగన్ ప్రభుత్వం వర్సెస్‌ ఎన్నికల కమిషన్:
ఏపీ ప్రభుత్వం వర్సెస్‌ ఎన్నికల కమిషన్…స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ఇది. కరోనా కారణంగా 2020 మార్చిలో వాయిదా వేసిన స్థానిక ఎన్నికలను 2021 ఫిబ్రవరిలో ఎలాగైనా నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ భావిస్తోంది. అదే సమయంలో ఎన్నికల నిర్వహణను తాత్కాలికంగా నిలిపివేసేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కరోనా తీవ్రత తగ్గిందని.. ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ అంటోంటే.. చలికాలంలో వైరస్ విజృంభించే ప్రమాదముందన్న కేంద్రం హెచ్చరికలను ప్రస్తావిస్తూ….ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని జగన్ ప్రభుత్వం అంటోంది.

మిగిలిన రాష్ట్రాలతో ఏపీని పోల్చి చూడొద్దు:
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్‌, ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ ఉదాహరణగా చూపుతోంటే.. మిగిలిన ఏ రాష్ట్రాలతోనూ ఏపీని పోల్చి చూడొద్దని ప్రభుత్వం అంటోంది. ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణ ఆలోచన సరైన నిర్ణయం కాదని…ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని…ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డకు లేఖ రాయడం…ఈ లేఖ….ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తిని ప్రశ్నించడమేనని నిమ్మగడ్డ బదులివ్వడం… ఈ వ్యవహారంలో తాజా పరిణామం…

కరోనా తీవ్రత తగ్గిందన్న ఈసీ:
వచ్చే(2021) ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని ఎలక్షన్ కమిషన్‌ ప్రకటించడంతో ఏపీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాక షెడ్యూల్ ఖరారు చేస్తామని ఎన్నికల కమిషన్ తెలిపింది. రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గిందని, ఒకప్పుడు రోజుకు పదివేలకు పైగా కేసులు నమోదైతే.. ప్రస్తుతం వాటి సంఖ్య రెండు వేలకు తగ్గిందని ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ అన్నారు. రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకున్నామని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడామని… అన్ని పరిస్థితులు గమనించాక….రాష్ట్రంలో కరోనా నియంత్రణలో ఉందని గమనించి..ఎన్నికల నిర్వహణకు సిద్ధమయ్యామని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు