Lokesh Jagan Representative Image (Image Credit To Original Source)
Nara Lokesh: మాజీ ముఖ్యమంత్రి జగన్ కు మంత్రి నారా లోకేశ్ ఆఫర్ ఇచ్చారు. టీ20 వరల్డ్ కప్ లో ఇండియా ఫైనల్ కి వెళ్తే చూసేందుకు తప్పకుండా వెళ్తానన్నారు. అంతేకాదు పులివెందుల ఎమ్మెల్యే వస్తానంటే ఆయనకూ టికెట్ నేను తీసుకుంటా అంటూ ఆఫర్ ఇచ్చారు లోకేశ్. ఇటీవల మంత్రి లోకేశ్ పై జగన్ విమర్శలు, సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. క్రికెట్ మ్యాచ్ చూసేందుకు ప్రత్యేక విమానంలో లోకేశ్ తిరుగుతున్నారని జగన్ ఆరోపించారు. మంత్రి ఇలా తిరగొచ్చా అని ప్రశ్నించారు. క్రికెట్ మ్యాచ్ చూసేందుకు కొలంబో వెళ్లాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. ఇంట్లోనే టీవీలో చూస్తే సరిపోతుంది కదా అని సూచించారు. తాను కూడా ఇండియా మ్యాచ్ ను టీవీలోనే చూశానని జగన్ అన్నారు. దీనికి తాజాగా మంత్రి లోకేశ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. భారత్ ఫైనల్ కు వెళితే మ్యాచ్ చూసేందుకు తాను వెళ్తానని చెప్పడమే కాదు.. వస్తానంటే జగన్ కి కూడా టికెట్ తీసుకుంటానని సెటైర్ వేశారు లోకేశ్.
కల్తీ నెయ్యి, హెరిటేజ్ అంశాలపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. వారి ఆరోపణలను లోకేశ్ ఖండించారు. కిలో నెయ్యి 360 రూపాయలకు ఎక్కడ దొరుకుతుందో చూపించండి? అని సవాల్ విసిరారు లోకేశ్. కిలో 360 రూపాయలకు దొరుకుతుంటే అది కల్తీ నెయ్యి అవుతుందన్నారు. మామూలుగా మార్కెట్ లో కిలో నెయ్యి ధర వెయ్యి రూపాయలపైన ఉందని తెలిపారు.
ఇందాపూర్ డెయిరీ, హెరిటేజ్ కు ఎటువంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్ కో-కంపెనీ అని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించాడని తప్పు పట్టిన లోకేశ్.. అంత సీనియర్ నేతకు కో కంపెనీ అనే పదం ఉండదనే విషయం తెలియదా? అని ప్రశ్నించారు. ఇందాపూర్ డెయిరీ హెరిటేజ్ కో ప్యాకర్ మాత్రమే అని తెలిపారు. హెరిటేజ్ లిస్టెడ్ కంపెనీ అని చెప్పారు. తమ మీద సెబీకి కూడా ఫిర్యాదు చేశారన్న లోకేశ్.. ఏమైనా ఆధారాలు ఇచ్చారా? నిరూపించారా? అని నిలదీశారు.
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో సాక్షి, భారతి సిమెంట్స్ ప్రభుత్వం నుంచి వెయ్యి కోట్లు రూపాయలు లబ్ధి పొందాయని ఆరోపించారు. హెరిటేజ్ ఇన్నేళ్లలో ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని మంత్రి లోకేశ్ చెప్పారు.
శాసనమండలి జరగాలని అనుకునే వాళ్ళు నాలుగు రోజులు సభను ఎందుకు అడ్డుకుంటారు అని మంత్రి లోకేశ్ ప్రశ్నించారు. ఇప్పుడు బడ్జెట్ మీద చర్చ కావాలని మండలిలో వైసీపీ సభ్యులు అడగడం ఏమిటి? అని మండిపడ్డారు. ఈ విషయం మండలి సమావేశాలను అడ్డుకున్నప్పుడు వైసీపీ సభ్యులకు తెలియదా? అని సీరియస్ అయ్యారు. యువగళం సమయంలో తాను అందరిని కలిసేవాడినని, రెండేళ్ళు గ్యాప్ వచ్చిందని, అందుకనే మళ్ళీ అందరిని పిలిచి ఫ్యామిలీలతో భేటీ అవుతున్నా అని లోకేశ్ వివరించారు. అక్కడ అసలు రాజకీయాలు చర్చించడం లేదని స్పష్టం చేశారు.
ఇక పార్టీలో జూనియర్లు, సీనియర్ల మధ్య సమన్వయం పూర్తిగా ఉందని మంత్రి లోకేశ్ చెప్పారు. పార్టీలో తనతో సహా అందరూ ఎవరి బూత్ లో వాళ్ళు మెజారిటీ తేవాలని తేల్చి చెప్పారు. అప్పుడు మాత్రమే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయగలం అన్నారు.
Also Read: రాజమండ్రిలో కల్తీ పాల కలకలం.. నలుగురి మృతి.. వివరాలు తెలిపిన కలెక్టర్, ఎస్పీ