Nara Lokesh : బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది.. మంత్రి నారా లోకేశ్..
Nara Lokesh : విశాఖ కేజీహెచ్‌లో బాధిత కుటుంబాలను రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్ పరామర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
- Harish Thanniru
- Updated on- June 9, 2026 / 12:19 PM IST
minister nara lokesh visits visakha steel plant victims families at Vizag KGH
Nara Lokesh : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సోమవారం భారీ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 8మంది ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా.. మంత్రి నారా లోకేశ్ మంగళవారం విశాఖ చేరుకొని విశాఖ కేజీహెచ్‌లో బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును వారిని అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని అండగా ఉంటామని భరోసా కల్పించారు.
కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు అనిత, సంధార్యాణి, ఎంపీ శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, చింతకాయల విజయ్ తదితరులు లోకేశ్ వెంట ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన లోకేశ్ మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు వారి వెన్నంటి నిలబడేందుకే ఆస్పత్రికి వచ్చారని తెలిపారు. ప్రమాదంలో ప్రభావితమైన కుటుంబాలకు జీవితాంతం అండగా ఉంటామని నారా లోకేశ్ స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవడంలో అందరి పోరాటం కీలక పాత్ర పోషించిందని మంత్రి గుర్తు చేశారు. ప్రమాద ఘటనపై ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ నివేదిక అందిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేశ్ వెల్లడించారు.
