gachibowli gold theft case : గచ్చిబౌలిలో భారీ చోరీ.. వ్యాపారవేత్త ఇంట్లో కేజీ బంగారం మాయం.. నేపాలీ దంపతుల పనేనా?
gachibowli gold theft case
- గచ్చిబౌలిలో భారీ చోరీ
- కొద్ది గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు
- పోలీసుల అదుపులో నేపాలీ దంపతులు
- సుమారు రూ.6కోట్ల సొత్తు స్వాధీనం?
gachibowli gold theft case : హైదరాబాద్ నగరంలో నేపాలీ గ్యాంగ్ చోరీల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇటీవల నేపాలీ గ్యాంగ్ భారీ దొంగతనానికి పాల్పడగా.. తాజాగా.. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో భారీచోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు కిలో బంగారు ఆభరణాలు మాయమైనట్లు గుర్తించారు. ఈ ఘటనలో ఇంట్లో పనిచేస్తున్న నేపాల్‌కు చెందిన దంపతులపై ఇంటి యాజమాని, పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టగా.. కొన్ని గంటల్లోనే కేసును చేధించారు. చోరీకి పాల్పడిన నేపాలీ దంపతులను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, నెల రోజుల క్రితమే ఆ నేపాలీ దంపతులను ఇంటి పనులకోసం యజమాని కుటుంబం నియమించుకుంది. ఇటీవల కుటుంబ సభ్యులు ముంబై వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోగా, ఆ దంపతులు కనిపించలేదు. అయితే ఇంటి తాళాలు పగలగొట్టిన ఆనవాళ్లు లేకపోవడంతో తొలుత ఎలాంటి అనుమానం రాలేదు.
అయితే పూజా గదిలో ఉంచిన బంగారు గొలుసు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మరిన్ని బంగారు ఆభరణాలు కూడా మాయమైనట్లు గుర్తించారు. దీంతో వెంటనే గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. దోపిడీ చేసింది నేపాలీ దంపతులేనని పోలీసులు అనుమానించారు. పరారీలో ఉన్నట్లు భావించిన నేపాలీ దంపతులకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గచ్చిబౌలి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నేపాల్ దంపతులు పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే, వారి వద్ద దాదాపు రూ.6కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
