ఈ విపత్కర పరిస్థితులకు గత ప్రభుత్వమే కారణం- బుడమేరు వరదపై మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు

రాజధానిపై జగన్ విషం చిమ్మారు. ఇప్పుడు సహించలేక విమర్శలు‌ చేస్తున్నారు. వర్షాలకు కుంగిపోయే పరిస్థితి, ముంపునకు గురయ్యే పరిస్థితి రాజధానికి లేదు.

Budameru Floods : బుడమేరు ఆక్రమణలపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుడమేరు ఆక్రమణలను పట్టించుకోకపోవడం వల్లే వరద ముంచెత్తిందన్నారు. విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలను పక్కన పెట్టాలని విపక్షాలకు సూచించారు మంత్రి నిమ్మల. బుడమేరకు మూడు చోట్ల గండ్లు పడ్డాయని, మరమ్మతులు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. గత ఐదేళ్ల పాలనలో జరిగిన తప్పులే ఈ విపత్కర పరిస్థితులకు కారణం అని మంత్రి నిమ్మల ఆరోపించారు. గత ప్రభుత్వం బుడమేరు లైనింగ్ పనులు కూడా చేయలేదని ఆయన మండిపడ్డారు.

”కృష్ణా నది చరిత్రలో 11 లక్షల 82 క్యూసెక్కుల నీరు ఎప్పుడూ రాలేదు. వరదల నుండి బాధితులను కాపాడటంలో అనుభవజ్ఞులు, క్రైసిస్ మేనేజ్ మెంట్ తెలిసిన చంద్రబాబు ఎక్స్ పీరియన్స్ ఉపయోగపడుతోంది. కలెక్టరేట్ లో రాజకీయాలు మాట్లాడకూడదని తెలిసినా‌ మాట్లడక‌ తప్పలేదు. బుడమేరుకు మూడు చోట్ల గండ్లు పడటం గత ప్రభుత్వ పాలనా వైఫల్యమే. ఎక్స్ టెన్షన్, లైనింగ్ పనులు చేయలేదు. 27 వేల‌ క్యూసెక్కుల నీరు రావడంతో తెగింది.
బుడమేరు వద్దకు రోడ్ ఫామ్ చేసుకొని బ్రీచస్ ఫిల్లింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం.

కరకట్ట వద్ద‌ లీపేజ్ ని కష్టపడి 75 శాతం అరికట్ట గలిగాం. 68వ గేట్ కౌంటర్‌ వెయిట్ పునరుద్ధరణకు కన్నమ నాయుడును తీసుకొస్తున్నాం. ఎవరూ భయపడొద్దు. గేట్ మూసేందుకు ఎలాంటి ఇబ్బందు లేవు. రెండు మూడు నెలల్లో కురువాల్సిన‌ వర్షం కొన్ని గంటల్లో కురిసింది. స్పెషల్ ఆఫీసర్లు, ఐఏఎస్ అధికారులు, మంత్రులు అందరూ పని చేస్తున్నారు. ఎఫెక్టివ్ గా ప్రభుత్వం పని చేస్తుంటే వైసీపీ ఆరోపణలు చేస్తోంది.

రెండు రోజుల్లో యదాస్థితికి తీసుకొస్తాం. రాజధానిపై జగన్ విషం చిమ్మారు. ఇప్పుడు సహించలేక విమర్శలు‌ చేస్తున్నారు. వర్షాలకు కుంగిపోయే పరిస్థితి, ముంపునకు గురయ్యే పరిస్థితి రాజధానికి లేదు. లక్షలాది మంది వరద బాధితులు హెల్ప్ లైన్ కు ఫోన్ చేయడం వల్ల సమస్యలు వచ్చాయి. హెల్ప్‌ లైన్ నెంబర్ల సమస్యలు సీఎం ‌దృష్టికి‌ తీసుకెళ్లి పరిష్కరిస్తాం” అని మంత్రి నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు.

Also Read : విజయవాడ ముంపునకు ప్రధాన కారణం ఏంటి? ఈ పాపం ఎవరిది?

ట్రెండింగ్ వార్తలు