జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి అనుచరులు రాళ్ల దాడి…తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత

MLA Kethireddy followers pelted stones at JC Prabhakar Reddy’s house :  అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు రాళ్ల దాడి చేశారు. జేసీ ఆఫీస్ లో పనిచేసే కిరణ్ అనే వ్యక్తిపై దాడి చేసి గాయపర్చారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి కుటుంబ సభ్యులపై జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో అసభ్య మెసేజులు పెట్టారని ఆరోపిస్తూ కేతిరెడ్డి అనుచరులు దాడికి దిగారు.

ఇంట్లో ఎవరూ లేని పరిస్థితిలో జేసీ ఆఫీస్ లో పనిచేసే ఇద్దరు వ్యక్తులపై 20 మంది అనుచరులు దాడి చేశారు. కిరణ్ అనే వ్యక్తిపై దాడి చేశారు. ఈ దాడిలో అతనికి గాయాలు అయ్యాయి. రాళ్లదాడిపై పోలీసులతో జేసీ ప్రభాకర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు.

ఎమ్మెల్యే అనుచరులు దాడి చేస్తుంటే ఏం చేస్తున్నారని పోలీసులపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. అనుచరులతోపాటు స్వయంగా ఎమ్మెల్యే సైతం తమపై దాడి చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు.

పెళ్లికి వెళ్లిన జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులతో అక్కడికి వెళ్లారు. ఎమ్మెల్యే అనుచరులు దాడి చేస్తుంటే ఏం చేస్తున్నారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాలు భారీగా మోహరించడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది.