Vishaka News
Vishaka News: విశాఖపట్నంలోని మధురవాడ పరిధి మారీకవలసలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని 3 సంవత్సరాల చిన్నారిని హతమార్చిన తల్లి.. అనంతరం గుట్టు చప్పుడు కాకుండా స్మశానంలో ఖననం చేసింది. గత రెండు రోజుల నుంచి పాప కనిపించకపోవడంతో తల్లి వరలక్ష్మిని స్థానికులు నిలదీశారు.. ఆమె నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల విచారణలో వరలక్ష్మి పాపను హత్యచేసి ఖననం చేసినట్లుగా ఒప్పుకుంది. దీంతో ఆమెను స్మశానవాటికకు తీసుకెళ్లి ఎమ్మార్వో సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం బాలిక మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. విచారణలో భాగంగా పోలీసులు వరలక్ష్మిని గ్రామంలోకి తీసుకురావడంతో గ్రామస్తులు ఆమెపై దాడికి యత్నించారు.
వరలక్ష్మిని తమకు అప్పగించాలంటూ స్థానికులు డిమాండ్ చేశారు. పోలీస్ వాహనంపై రాళ్లు రువ్వారు. దీంతో మారీకవలసలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. కాగా వరలక్ష్మి గత కొంతకాలంగా జగదీశ్ రెడ్డి అనే వ్యక్తితో సహజీవనం చేస్తుంది. వీరి బంధానికి అడ్డుగా ఉందని పాపను హత్య చేసినట్లు తెలుస్తుంది.