AP MPP-ZPP Elections Schedule : అధ్యక్ష, ఉపాధ్యక్ష పీఠాల కోసం పోరు.. ఎంపీపీ, జెడ్పీపీ పరోక్ష ఎన్నికల షెడ్యూల్ విడుదల..!
AP MPP-ZPP Elections Schedule : ఎంపీపీ, జెడ్పీపీ పరోక్ష ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది. మండల ప్రజా పరిషత్‌లలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి ఎన్నికకు ఈ నెల 19న ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నారు..
- Sreehari A
- Updated on- November 10, 2026 / 02:48 PM IST
Mpp And Zpp Chairperson Elections On November 19 And 20 Full Schedule
- ఎంపీపీ, జెడ్పీపీ పరోక్ష ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్
- నవంబర్ 19, 20న కీలక ఎన్నికలు.. ఎవరికి ఓటు హక్కుందంటే?
- ఎంపీపీ, జెడ్పీపీ ఎన్నికల పూర్తి వివరాలివే
AP MPP-ZPP Elections Schedule : గ్రామీణ రాజకీయాల్లో మరోసారి సందడి మొదలుకానుంది. మండల, జిల్లా పరిషత్‌ల్లో కీలకమైన పదవుల భర్తీకి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎంపీపీ, జెడ్పీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు పరోక్ష ఎన్నికలు నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. దీంతో స్థానిక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కనున్నాయి.. ఎవరికి ఏ పదవి దక్కుతుంది? ఏ పార్టీకి పట్టు లభిస్తుంది? అన్న చర్చలు మొదలయ్యాయి..
నవంబర్ 19న అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి ఎన్నిక :
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. మండల ప్రజా పరిషత్‌ల్లో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి ఎన్నిక నవంబర్ 19న జరగనుంది. జిల్లా పరిషత్‌ల్లో చైర్‌పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ ఎన్నిక నవంబర్ 20న నిర్వహించనున్నారు. ఈ ప్రత్యేక సమావేశాలకు సంబంధించిన నోటీసులను నవంబర్ 14లోగా సభ్యులకు అందించాలని అధికారులను ఆదేశించింది..
Read Also : Cyberabad Work From Park : ఇక కేఫ్‌లకు వెళ్లాల్సిన పనిలేదు.. పార్కులో కూర్చొని ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు..!
ఇక మైనారిటీ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక కూడా నిర్వహించనున్నారు. ప్రతి ఎంపీపీలో ఒకరు, ప్రతి జెడ్పీపీలో ఇద్దరు కోఆప్టెడ్ సభ్యులను ఎన్నుకుంటారు. నవంబర్ 19న మధ్యాహ్నం ఒంటి గంటకు ఎంపీపీల్లో, నవంబర్ 20న అదే సమయానికి జెడ్పీపీల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాన పదవులకు ఎన్నిక నిర్వహిస్తారు.
పోటీ అర్హత, ఓటు వేసే హక్కు వీరికే :
ఈ ఎన్నికల్లో నేరుగా ఎన్నికైన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకే ఓటు వేసే హక్కు ఉంటుంది. పోటీ చేసే అర్హత కూడా వారికే ఉంటుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కోఆప్టెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉండదు. గుర్తింపు పొందిన పార్టీల సభ్యులు తమ పార్టీ విప్‌కు అనుగుణంగా చేతులెత్తి ఓటు వేయాలి. విప్‌ను ధిక్కరిస్తే పదవి కోల్పోయే ప్రమాదం ఉంది.
సమావేశం సజావుగా జరగాలంటే.. ఎన్నికైన సభ్యుల్లో కనీసం సగం మంది హాజరు కావాలి. గంటలోగా కోరం లేకపోతే సమావేశాన్ని మరుసటి రోజుకు వాయిదా వేస్తారు. మరోవైపు ఎన్నికల కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు, బారికేడ్లు ఏర్పాటు చేయనున్నారు.
అవసరమైతే బీఎన్‌ఎస్‌ఎస్ 163వ సెక్షన్‌ను అమలు చేయనున్నారు. మీడియాకు అనుమతితో పాటు వీడియో రికార్డింగ్, సీసీ కెమెరాలు, లైవ్ టెలిక్యాస్ట్ కూడా అవకాశం కల్పించనున్నారు. మొత్తానికి ఈ రెండు రోజుల ఎన్నికలు మండల, జిల్లా స్థాయి రాజకీయాల్లో కీలకంగా మారనున్నాయి..
