Cyberabad Work From Park : ఇక కేఫ్‌లకు వెళ్లాల్సిన పనిలేదు.. పార్కులో కూర్చొని ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు..!
Cyberabad Work From Park : హైదరాబాద్‌లో వర్క్ ఫ్రమ్ పార్క్ సదుపాయం రాబోతోంది. సైబరాబాద్‌లో 30 నుంచి 40 పార్కులను వై-ఫై, ఛార్జింగ్ పాయింట్లు, కో-వర్కింగ్ సౌకర్యాలతో మోడ్రాన్ వర్క్స్పేస్లుగా తీర్చిదిద్దనున్నారు. పూర్తి వివరాలివే..
Cyberabad Work From Park
- ఐటీ ఉద్యోగులు, ఫ్రీలాన్సర్లకు గుడ్ న్యూస్..
- పార్కుల్లోనే వర్క్ ఫ్రమ్ పార్క్ ట్రెండ్
- హైదరాబాద్‌లో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం
- సైబరాబాద్‌లో 40 పార్కుల అభివృద్ధి
Cyberabad Work From Park : ఐటీ ఉద్యోగులు, ఫ్రీలాన్సర్లకు గుడ్ న్యూస్.. కేఫ్‌లకు వెళ్లాల్సిన అవసరం లేదు.. ఏం చక్కా పార్కుల్లోనే వర్క్ చేసుకోవచ్చు.. అవును.. మీరు చదివింది నిజమే.. అతి త్వరలో ఈ వర్క్ ఫ్రమ్ పార్క్ విధానం అమల్లోకి రాబోతుంది.. అంటే.. హైదరాబాద్‌లో ఉద్యోగుల వర్కింగ్ విధానం పూర్తిగా మారబోతోంది..
ప్రతిరోజూ ఆఫీస్‌కు వెళ్లడం, ఇంట్లోనే కూర్చొని పనిచేయడం, లేదంటే కాఫీ షాపుల్లో ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి వర్క్ చేసుకోవడం.. వీటన్నింటికీ భిన్నంగా ఓ సరికొత్త ట్రెండ్ మొదలుకాబోతుంది.. అదే వర్క్ ఫ్రమ్ పార్క్.. పచ్చని చెట్ల మధ్య, ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని ఆఫీస్ పనులు చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి రానుంది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ఈ కొత్త ట్రెండ్ కోసం అంతా రెడీ చేస్తోంది..
30 నుంచి 40 పార్కులు :
దుబాయ్‌లో ఇప్పటికే అమలవుతున్న ఇలాంటి ఆలోచనతో స్ఫూర్తి పొందిన అధికారులు.. సైబరాబాద్ పరిధిలోని 30 నుంచి 40 పార్కులను ఆధునిక వర్క్స్పేస్లుగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా 2 చోట్ల పైలట్ ప్రాజెక్టుల పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి..
Read Also : EPS Pension Hike : పెన్షనర్లకు భారీ ఊరట.. ఇకపై నెలకు రూ.1,000 కాదు.. రూ.3 వేల పింఛను?
2027 జనవరి 1 నాటికి అందుబాటులోకి :
మొదటి వర్క్‌స్పేస్‌ను మసీద్ బండాలోని మాధవ హిల్స్ కాలనీ పార్కులో ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కులో కొంత భాగాన్ని పని చేసుకునే వారి కోసం ప్రత్యేకంగా కేటాయించనున్నారు. మరో సెంటర్ మాదాపూర్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఈ రెండు పైలట్ ప్రాజెక్టులను 2027 జనవరి 1 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు..
ఇక్కడ ఫ్రీ వై-ఫై, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పాయింట్లు, కంపర్టబుల్ కుర్చీలు, వర్క్స్టేషన్లు, కో-వర్కింగ్ సదుపాయాలు ఉండనున్నాయి. అంతేకాదు.. కాఫీ, స్నాక్స్ కియోస్కులు, వాకింగ్ ట్రాక్స్, పార్కింగ్, సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయనున్నారు.
రూ. 50 నుంచి రూ. 100 వరకు ఛార్జీ :
ఈ సదుపాయాలను వినియోగించుకుని వారి నుంచి ఒక్కొక్కరికి రూ.50 నుంచి రూ.100 వరకు నామమాత్రపు రుసుము వసూలు చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే, దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
ఈ ప్రయోగం సక్సెస్ అయితే మరిన్ని పార్కులకు విస్తరించే అవకాశం ఉంది. ఇప్పటికే 300 కొత్త పార్కుల అభివృద్ధి, పాత పార్కుల ఆధునికీకరణపై దృష్టి పెట్టిన అధికారులు.. నగరంలో పచ్చదనాన్ని పెంచడంతో పాటు ప్రజలకు కొత్త పని వాతావరణాన్ని అందించాలని భావిస్తున్నారు.. మొత్తానికి ఆఫీస్ గోడల మధ్య కాకుండా ప్రకృతి ఒడిలో పని చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నమాట..
