Nandyal Family Suicide : కర్నూలు జిల్లా నంద్యాలలో నలుగురు చావుకు కారణమైన ఖాకీలపై వేటు పడింది. నంద్యాల సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌ను అరెస్ట్‌చేశారు. అబ్దుల్ సలాం ఫ్యామిలీ ఆత్మహత్యకు పోలీసుల వేధింపులే కారణమని విచారణలో తేలడంతో వారిపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇద్దరిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈనెల 3న అబ్దుల్ సలాం కుటుంబం రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంది. సలామ్‌తో పాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. సీఐ సోమశేఖర్‌రెడ్డి వేధింపులే తమ మృతికి కారణమంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు.
ఓ సాధారణ ఆటో డ్రైవర్ : –
అబ్దుల్ సలాం… ఓ సాధారణ ఆటో డ్రైవర్… పొద్దంతా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భర్త కష్టానికి తోడుగా ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తోంది భార్య నూర్జహాన్. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి బుద్దిగా చదువుకునే ఇద్దరు పిల్లలు సల్మా , ఖలందర్‌లు. సరిగ్గా ఏడాది కిందట అంటే 2019 నవంబర్ 7న పోలీస్ స్టేషన్‌లో అబ్దుల్ సలాంపై తొలిసారి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.
బంగారం దుకాణంలో గుమాస్తా : –
నంద్యాలలోని ఓ బంగారం దుకాణంలో 1992 నుంచి అబ్దుల్ సలాం గుమాస్తాగా పని చేస్తున్నాడు. ఈ దుకాణంలో 5 కేజీల బంగారం దొంగతనం జరిగిందంటూ ఓనర్లు ఫిర్యాదు చేశారు. దీంతో వివిధ సెక్షన్ల కింద అబ్దుల్ సలాంపై పోలీసులు కేసు పెట్టారు. దీంతో 42 రోజుల పాటు జైలు జీవితం గడిపి బెయిల్ పై బయటకు వచ్చాడు. బంగారం దుకాణంలో పని మానేసి ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు.
https://10tv.in/minister-sucharitas-response-on-nandyal-family-suicide-ci-suspended/
రూ. 70 వేలు పొగొట్టుకున్నాడని : –
వారి కుటుంబంలో నవంబర్ 1న కుదుపు మొదలైంది. సలాం ఆటోలో ప్రయాణించిన ఓ వ్యక్తి 70 వేలు పొగొట్టుకున్నాడని, స్టేషన్‌కి రావాలంటూ పిలిచారు నంద్యాల 1 టౌన్ పోలీసులు. 70 వేలు ఏం చేశావంటూ నరకం చూపించారు. మానసికంగా, శారీరకంగా వేధించారు. పాత బంగారం కేసుకు ఉండటం… ఇప్పుడు అబ్దుల్ సలాం ఆటోలో ప్రయాణించిన వ్యక్తి 70 వేల రూపాయలు పోగొట్టుకోవడంతో…. పోలీసులు అబ్దుల్ సలాంపై తమ ప్రతాపం చూపించారు. దొంగతనం చేసినట్టు ఒప్పుకోవాలంటూ వేధించారు.
చూపించుకోలేని చోట భరించలేని విధంగా చావబాదారు. మాటలతో మానసికంగా వేధించారు. గతంలో ఓ సారి జైలు జీవితం అనుభవించిన అబ్దుల్ సలాంకి మరో సారి దొంగతనం ఆరోపణలు రావడంతో కుంగిపోయాడు.
అవమాన భారం, పోలీసుల వేధింపులు: –
ఏం తప్పు చేయలేదని తన మనస్సాక్షి చెబుతోంది. అస్తులు తెగనమ్మి అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు డబ్బులు తిరిగి ఇచ్చిన గతం తనకు ఉంది. పద్దెనిమిదేళ్ల పాటు బంగారం షాపులో నమ్మకస్తుడిగా పని చేసిన పేరుంది. ఓనర్ల మధ్య తగాదాల వల్ల వచ్చిన సమస్యతో ఓ సారి దొంగగా ముద్రపడ్డాడు. మరోసారి అదే తరహా నింద తన మీద పడడంతో తట్టుకోలేకపోయాడు. ఒకవైపు అవమానభారం, మరోవైపు పోలీసుల వేధింపులు… అన్నీ కలిపి అబ్దుల్ సలాం కుటుంబాన్ని నిస్సహాయులను చేశాయి. చివరకు ఆ కుటుంబం ఆత్మహత్య మార్గాన్ని ఎంచుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.