Nara Lokesh Ugadi Controversy : పూజ గదిలో వింత బొమ్మ.. క్షుద్ర పూజలంటూ ట్రోల్స్.. క్లారిటీ ఇచ్చిన నారా లోకేష్
Nara Lokesh Ugadi Controversy: ఉగాది పండగ నాడు నారా లోకేష్ షేర్ చేసిన ఓ ఫొటో వివాదాన్ని రాజేసింది. దీనిపై నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు.
- Dharani Pilli
- Updated on- March 20, 2026 / 04:47 PM IST
nara lokesh clarity on pooja room doll controversy give details about it
Nara Lokesh Ugadi Controversy : ఉగాది పండగ సందర్భంగా.. చాలా మంది సినీ, రాజకీయ సెలబ్రిటీలు పండగ శుభాకాంక్షలు చెబుతూ.. తమ ఇంటి ఉగాది వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ నారా లోకేష్ కూడా ఉన్నారు. పూజ గది ఫొటోలను కూడా షేర్ చేశారు. అయితే వీటిల్లో ఒక ఫొటో వివాదాన్ని రాజేసింది. లోకేష్ షేర్ చేసిన ఫొటోల్లో ఒక వింత బొమ్మ హాట్ టాపిక్ అయ్యింది. ఆ వింత బొమ్మ ఏంటి.. ఇలాంటి బొమ్మలను క్షుద్ర పూజలు చేసేందుకు వాడతారు.. ఇదేదో చేతబడికి సంబంధించిన బొమ్మ అంటూ కొందరు కామెంట్స్ చేశారు. పవిత్రమైన పూజ గదిలో క్షుద్ర పూజలు చేస్తున్నారా అని ప్రశ్నించారు.
గంటల వ్యవధిలోనే ఈ ఫొటో వైరల్ గా మారింది. నారా వారి పూజ మందిరంలో క్షుద్ర పూజలంటూ జోరుగా ప్రచారం సాగుతుండటంతో.. చివరకు దీనిపై నారా లోకేష్ స్పందించారు. ఆ బొమ్మ ఏంటి.. ఎందుకు దాన్ని పూజ మందిరంలో ఉంచారో చెప్పుకొచ్చారు. దీనిపై లోకేష్ స్పందిస్తూ.. “మా పూజా మందిరంలో ఉన్న ఆ బొమ్మ ఏదో క్షుద్ర పూజల కోసం తెచ్చింది కాదు. అది శివుడి బొమ్మ. దాన్ని తయారు చేసింది దేవాన్ష్. తన నాలుగేళ్ల వయసులో దేవాన్ష్.. స్వయంగా తన చేతులతో ఈ బొమ్మను తయారు చేశాడు. తనకు చిన్నప్పటి నుంచి శివుడు అంటే చాలా అభిమానం. ఆ భక్తితోనే దేవాన్ష్ స్వయంగా తన చేతులతో ఒక చిన్న శివలింగాన్ని, ఈ శివుడి బొమ్మను తయారు చేశాడు. నాటి నుంచి నేటి వరకు అది మా పూజ మందిరంలోనే ఉంటుంది” అని తెలిపారు.
పిల్లలు వారి బాల్యంలో చేసే పనులు తల్లిదండ్రులకు ఎంతో ప్రత్యేకమన్న లోకేష్.. ఆ వయసులో వారు చేసే చిన్న చిన్న బొమ్మలు, డ్రాయింగులను తల్లిదండ్రులు జ్ఞాపకాలుగా దాచుకోవడం సహజమని వెల్లడించారు. అలానే తాము కూడా దేవాన్ష్ తయారు చేసిన ఆ శివుడి బొమ్మను పారేయకుండా, భక్తితో తమ పూజ గదిలోనే పెట్టామని తెలిపారు. “కొందరు విశ్వాసాన్ని అర్థం చేసుకుంటారు.. మరి కొందరికి అర్థం కాదు. అయితే ఇలాంటి భక్తికి వివరణలు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు” అంటూ లోకేష్ కౌంటర్ ఇచ్చారు. తన ట్వీట్ చివరలో “హరహరమహాదేవ్” అని పేర్కొన్నారు.
