Arunachala : అరుణాచలం మోక్షమార్గంలో చిక్కుకుపోయిన ఏపీ మహిళ.. తప్పిన ప్రమాదం.. హెచ్చరిక బోర్డు ఏర్పాటు
Arunachala Moksha Margam : అరుణాచలేశ్వరస్వామి ఆలయ గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్న మోక్ష మార్గంలో ఏపీకి చెందిన భక్తురాలు చిక్కుకుపోయింది.
Arunachala Moksha Margam
- అరుణాచలం మోక్షమార్గంలో తప్పిన ప్రమాదం
- మోక్షమార్గంలో చిక్కుకుపోయిన మహిళ
- వెంటనే బయటకు లాగి కాపాడిన భక్తులు
Arunachala Moksha Margam : తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయ గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్న ఇడుక్కు పిళ్లైయార్ గుహ (మోక్ష మార్గం)లో ఏపీకి చెందిన మహిళ చిక్కుకుపోయింది. గిరిప్రదక్షిణ సమయంలో మోక్ష ద్వారంలో సోమవారం ప్రమాదం తప్పింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళా భక్తురాలు గుహలోకి ప్రవేశించిన తర్వాత మధ్యలోనే చిక్కుకుపోయింది. ఊపిరి అందక తీవ్ర ఆందోళనకు గురైన ఆమె కేకలు వేయడంతో అక్కడే ఉన్న ఇతర భక్తులు వెంటనే స్పందించి బయటకు లాగి ఆమె ప్రాణాలను కాపాడారు.
Also Read : AP Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. దైవదర్శనానికి వెళ్తుండగా ఘటన.. కొద్దిదూరం ఈడ్చుకెళ్లిన లారీ..
గత మూడు రోజలు క్రితం అరుణాచలం మోక్ష మార్గంలో ఇరుక్కొని ఏపీకి చెందిన భక్తుడు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. శుక్రవారం రోజు రాత్రి కుటుంబంతో కలిసి అరుణాచలం వెళ్లిన మణికుమార్ అనే భక్తుడు.. రాత్రి పదకొండు గంటల సమయంలో గిరి ప్రదక్షిణ మార్గంలోని మోక్ష ద్వారంలో లావు కారణంగా ఇరుక్కుని.. బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కుటుంబసభ్యులు, ఇతర భక్తులు గమనించి.. ఎంతో శ్రమించి మణికుమార్‌ను బయటకు తీసుకువచ్చారు. అయితే ఊపిరి అందక మణికుమార్ అప్పటికే అపస్మారకస్థితికి చేరుకున్నారు. కుటుంబసభ్యులు హుటాహుటిన అంబులెన్సులో ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తాజాగా.. ఏపీకి చెందిన మహిళా భక్తురాలు మోక్ష ద్వారంలో చిక్కుకొని తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీంతో స్థానిక భక్తులు ఊపిరిపీల్చుకున్నారు.
వరుసగా ప్రమాదాలు చోటు చేసుకోవటంతో ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6గంటల నుంచి రాత్రి 8గంటల వరకు మాత్రమే మోక్ష మార్గంలో భక్తులను అనుమతించనున్నట్లు తెలిపారు. ఊబకాయులు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు గుహలోకి ప్రవేశించకూడదంటూ మూడు భాషల్లో ఆలయం వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.
తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరుణాచలేశ్వరస్వామి ఆలయం గిరిప్రదక్షిణను హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు ప్రతి నెలా, ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో అరుణాచలానికి చేరుకుని గిరిప్రదక్షిణ నిర్వహిస్తుంటారు. గిరిప్రదక్షిణ మార్గంలో ఉన్న ఇడుక్కు పిల్లయ్యార్ గుహ, భక్తులలో ‘మోక్ష మార్గం’గా ప్రసిద్ధి చెందింది. ఈ ఇరుకైన రాతి సందు గుండా ప్రయాణిస్తే జీవితంలోని కర్మలు శుద్ధి అవుతాయని, పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయని, అహంకారం నశిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అంతేకాదు, ఈ మార్గం గుండా వెళితే పునర్జన్మ ఉండదని, మోక్షం సిద్ధిస్తుందని కూడా భక్తుల నమ్మకం.
ఈ మోక్ష మార్గం చాలా ఇరుకుగా ఉంటుంది. భక్తులు రాతి గృహ సందులో నుంచి పడుకుని, పాకుతూ మరోవైపునకు చేరుకోవాల్సి ఉంటుంది. దీంతో శరీరాకృతి లావుగా ఉన్నవారికి లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ మార్గంలో ప్రయాణించడం ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.
