Bonda Umamaheswara Rao : అందరిలా నేనూ వెళ్లి వచ్చా.. పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ వ్యవహరించను : అధిష్టానానికి బోండా ఉమ వివరణ!
Bonda Umamaheswara Rao : పార్టీకి వ్యతిరేకంగా నేను ఎప్పుడూ వ్యవహరించను. వైసీపీ హయాంలో ప్రాణాలు అడ్డుపెట్టి పార్టీకి అండగా నిలబడ్డాను. పార్టీకి నష్టం కలిగించే ఏ చర్యకూ పాల్పడనని బోండా ఉమ వివరణ ఇచ్చారు.
Bonda Umamaheswara Rao
- ఇద్దరు సభ్యుల కమిటీ ముందు హాజరైన బోండా ఉమ
- ముద్రగడ్డ పద్మనాభం సంస్మరణ సభ వ్యవహారంపై వివరణ
- అంబటి రాంబాబుతో వ్యవహారంపై కూడా బోండా క్లారిటీ
Bonda Umamaheswara Rao : ముద్రగడ్డ పద్మనాభం సంస్మరణ సభలో జరిగిన వ్యవహారంపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. దీనిపై ఇద్దరు సభ్యుతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వివరణ ఇచ్చారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే రామానాయుడు సభ్యులుగా ఇద్దరు సభ్యుల కమిటీ ముందు బోండా ఉమ హాజరై తన వివరణను వెల్లడించారు. ఆయన ఇచ్చిన వివరణను నివేదిక రూపంలో పార్టీ అధినేత చంద్రబాబుకు పంపనున్నారు. పార్టీకి వ్యతిరేకంగా తాను ఎప్పుడూ వ్యహరించనని బోండా ఉమ స్పష్టంచేశారు.
కమిటీ సమావేశం అనంతరం మీడియాతో బోండా ఉమా మాట్లాడుతూ.. సంస్మరణ సభకు హాజరైన తన వ్యవహారాన్ని కొన్ని దుష్టశక్తులు వక్రీకరించి సోషల్ మీడియా, ఇతర వేదికల్లో ట్రోల్ చేశాయని పేర్కొన్నారు. అన్ని పార్టీలకు చెందిన నేతలు హాజరైనట్లుగానే తాను కూడా ఆ కార్యక్రమానికి వెళ్లి వచ్చానని చెప్పారు.
‘‘పార్టీకి వ్యతిరేకంగా నేను ఎప్పుడూ వ్యవహరించను. వైసీపీ హయాంలో ప్రాణాలు అడ్డుపెట్టి పార్టీకి అండగా నిలబడ్డాను. పార్టీకి నష్టం కలిగించే ఏ చర్యకూ పాల్పడను’’ అని బోండా ఉమ కమిటీకి వివరించినట్లు తెలిపారు.
Read Also : CM Revanth Reddy : విద్యార్థులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. ఫీజు రీయింబర్స్మెంట్పై కీలక ప్రకటన!
విపరీతమైన ట్రోల్స్ నేపథ్యంలో ఈ ఘటన వల్ల పార్టీకి ఏమైనా నష్టం జరిగిందా అనే ఉద్దేశంతో తనను పిలిచి వివరణ కోరారని చెప్పారు. జరిగిన వాస్తవాలను, వక్రీకరణల కారణంగా ఏర్పడిన అపోహలను పల్లా శ్రీనివాసరావు, రామానాయుడుకు వివరించానన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు చెప్పారు.
అంబటి రాంబాబు అంశంపై వివరణ :
ముద్రగడ సంస్మరణ సభలో వైసీపీ నేత అంబటి రాంబాబుతో తన వ్యవహారంపై కూడా బోండా ఉమ స్పష్టత ఇచ్చారు. తాను ముందుగా తనకు కేటాయించిన సీటులో కూర్చున్నానని, ఆ సమయంలో అంబటి రాంబాబు వచ్చి తన పక్కన కూర్చున్నారని తెలిపారు.
‘‘సమావేశంలో అంబటి నాకు నమస్కారం పెట్టారు. నమస్కారానికి నమస్కారం పెట్టడం మన సంస్కారం. అందుకే నేను తిరిగి నమస్కారం చేశాను’’ అని వివరణ ఇచ్చారు. అలాగే నివాళులర్పించే సమయంలో కూడా అంబటి తన వెంట వచ్చి పక్కన నిలబడ్డారని చెప్పారు. ఆ పరిణామాలను కూడా కొందరు కావాలనే వక్రీకరించారని ఆరోపించారు.
నాపై విషప్రచారం చేశారు :
కొన్ని చానళ్లు తాను మాట్లాడని విషయాలను కూడా తనకు ఆపాదిస్తూ విషప్రచారం చేశాయని బోండా ఉమ మండిపడ్డారు. సంస్మరణ సభకు హాజరైన అంశాన్ని పార్టీ వ్యతిరేక చర్యగా చిత్రీకరించడం సరికాదన్నారు. కేవలం జరిగిన పరిణామాలను వక్రీకరించడం వల్లే సమన్వయ లోపం ఏర్పడిందని, అంతేతప్ప తనకు పార్టీపై ఎలాంటి వ్యతిరేకత లేదని బోండా ఉమ స్పష్టం చేశారు. అందరిలాగే నేనూ వెళ్లి వచ్చాను. పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ వ్యవహరించనంటూ అధిష్టానానికి తన వైఖరిని తెలియజేశారు.
బోండా వివరణపై టీడీపీ అధిష్టానం సంతృప్తి :
బోండా ఉమ ఇచ్చిన వివరణతో టీడీపీ అధిష్టానం సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. వ్యక్తులకన్నా పార్టీనే సుప్రీం అనేది ఎవరికైనా వర్తిస్తుందని ఈ సందర్భంగా అధిష్టానం స్పష్టం చేసింది. అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలు బహిరంగంగా మాట్లాడటం వల్ల పార్టీకి నష్టమా లాభమా? అని ఎందుకు బేరీజు వేసుకోలేకపోయారని బోండాని రామానాయుడు అడిగారు. కాపులకు టీడీపీ చేసిన మేలు, ప్రతిపక్షం చేసిన ద్రోహం మీకు తెలియంది కాదు కదా అని ప్రశ్నించినట్టు తెలిసింది.
సంస్మరణ సభకు హాజరుకావటాన్ని తప్పు పెట్టట్లేదని, చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేసేవిగా ఉన్నందునే వివరణ కోరాల్సి వచ్చిందని పల్లా, రామానాయుడు అన్నారు. అధినేత చంద్రబాబును తీవ్రంగా దూషించిన వ్యక్తిలతో సఖ్యతగా మెలాగటం క్యాడర్ జీర్ణించుకోలేక పోయిందని తెలిపారు. ఓ వర్గం బ్లూ మీడియా వక్రీకరిస్తుందని తెలిసి కూడా వారికే ఎందుకు ఇంటర్వ్యూలు ఇచ్చారని కూడా పల్లా, రామానాయుడు బోండాను ప్రశ్నించారు.
అయితే, సమన్వయలోపంతో కొన్ని పరిణామాలు చోటుచేసుకున్నాయని బోండా వివరణ ఇచ్చారు. అధినేత మాటకు, పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వ్యక్తిని కాదని ఈ సందర్భంగా బోండా స్పష్టం చేశారు. ఇకపై ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని బోండా వివరణ ఇవ్వడంతో అధిష్టానం సంతృప్తి చెందినట్టు తెలుస్తోంది.
