AY.12 Variant: తెలుగు రాష్ట్రాలకు మరో టెన్షన్.. హడలెత్తిస్తున్న కొత్త వేరియంట్!

కరోనా మహమ్మారి ఇంకా మన సమాజాన్ని వీడలేదు. వేరియంట్ల మీద వేరియంట్లు కొత్తగా రూపాంతరం చెంది మన మీద విరుచుకుపడుతూనే ఉన్నాయి. ఒకవైపు థర్డ్ వేవ్ భయాలు..

Ay.12 Variant

AY.12 Variant: కరోనా మహమ్మారి ఇంకా మన సమాజాన్ని వీడలేదు. వేరియంట్ల మీద వేరియంట్లు కొత్తగా రూపాంతరం చెంది మన మీద విరుచుకుపడుతూనే ఉన్నాయి. ఒకవైపు థర్డ్ వేవ్ భయాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంటే.. మరో కొత్త వేరియంట్ తెలుగు రాష్ట్రాలను హడలెత్తిస్తోంది. ఇప్పటి వరకు డెల్టా, డెల్టా ప్లస్‌ వేరియంట్లే ప్రమాదకరం అనుకుంటే.. డెల్టా ప్లస్‌లో ఏవై.12 అనే మరో వేరియంట్ మరింత డేంజరస్ గా కనిపిస్తుంది. ఇప్పటివరకు ఉన్న వేరియంట్ల కంటే ఇది మరింత వేగంగా వ్యాప్తి చెందుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏవై.12 రకం తొలి కేసు ఉత్తరాఖండ్‌లో ఆగస్టు 30న వెలుగు చూడగా వారం రోజుల్లోపే తెలుగు రాష్ట్రాలకూ వ్యాపించింది. ఏవై.12 కేసులు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 178 నమోదైతే అందులో తెలుగు రాష్ట్రాలలో ఏపీలో 18, తెలంగాణలో 15 కేసులు నమోదవడం ఆందోళనకరంగా కనిపిస్తుంది. ఈ ఏవై.12 రకం కేసుల నమోదులో ఉత్తరాఖండ్‌తో కలిసి ఏపీ మూడో స్థానంలో ఉండగా కేంద్ర ఆరోగ్యశాఖ ఈ వేరియంట్ వ్యాప్తిపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది.

సాధారణంగా ప్రతి ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌ నుంచి 15 రోజులకోసారి 15 నమూనాలను సీసీఎంబీతో పాటు ఇతర చోట్లకు పరీక్షించి వైరస్‌ మ్యుటేట్ ను గుర్తిస్తున్నారు. కొత్త వేరియంట్ వచ్చినప్పుడల్లా తమవద్ద ఉన్న పాత నమూనాలను మళ్లీ పరీక్షించి నిర్ధారించుకుంటారు. కాగా, ఇప్పటికే ఉన్న డెల్టా ప్లస్‌ వేరియంట్ వ్యాప్తి వేగం పెరుగుతుండగా దీని ప్రభావం కూడా బలంగా ఉంటుందని తెలుస్తుంది. డెల్టా ప్లస్ వేరియంట్ ఊపిరితిత్తుల కణాల్లో బలంగా అతుక్కుపోయి మోనోక్లోనల్‌ యాంటీబాడీ స్పందనను తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే డెల్టా ప్లస్‌ కేసులు అడపాదడపా బయటపడుతూనే ఉండగా మరోవైపు మ్యుటేషన్లతో డెల్టా ప్లస్‌లోనూ కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చాయి. వీటిని ఏవై.1, ఏవై.2, ఏవై.3.. పేర్లతో పిలుస్తుండగా కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రాలకు పంపిన నమూనాలలో దేశవ్యాప్తంగా ఏవై.12 కేసులు 178 వచ్చినట్లు తెలిపింది. దీన్ని కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే ‘వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌గా (VOC)’ ప్రకటించింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఈ కేసులు బయట పడినందున మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించిన కేంద్ర ఆరోగ్యశాఖ ఏవై.12 వేరియంట్ తీవ్రత గురించి మరింత తెలిసేందుకు ఇంకొంత సమయం పడుతుందని పేర్కొంది.