Nellore TDP President: నెల్లూరు టీడీపీ అధ్యక్ష పదవి కోసం గ్రూప్ వార్.. మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డిలలో ఎవరిది పైచేయి?
వలస వచ్చిన నేతల డిమాండ్‌కు ప్రాధాన్యత ఇవ్వకూడదని టీడీపీ లీడర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. పార్టీని నమ్ముకుని చాలామంది ఉన్నారని.. పార్టీ కోసమే పనిచేసే వారికే పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట.

Nellore TDP President: నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి హాట్ సీటు అయిపోయింది. జిల్లా మొత్తం టీడీపీ ఎమ్మెల్యేలే. పైగా పార్టీ పవర్‌లో ఉంది. పైగా జిల్లా బాస్ పోస్ట్ అంటే ఎక్కడికి వెళ్లినా ఓ హోదా ఉంటుంది. ఈ ఈక్వేషన్స్‌తోనే నెల్లూరు టీడీపీ పగ్గాల కోసం పోటీ తీవ్రంగా ఉందట. తమకు అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని నేతలు కోరడం ఒక ఎత్తు అయితే..మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తమ వర్గం నేతకు అధ్యక్ష పదవి ఇప్పించుకునేందుకు లాబీయింగ్ చేస్తున్నారట. ఈ ఇద్దరిలో ఎవరిది పైచేయి అవుతుందనేదే ఇప్పుడు నెల్లూరు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా ఉంది.
నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు ఆల్రెడీ త్రీమెన్ కమిటీ జిల్లాకు వచ్చి వెళ్లింది. మంత్రులు, ఎమ్మెల్సీలు మాజీ ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను తీసుకున్నారు. అయితే ప్రస్తుతం నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న అబ్దుల్ అజీజ్‌ను కొనసాగించాలని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సూచించారు. మంత్రి నారాయణ.. పట్టాభి రామిరెడ్డిని జిల్లా అధ్యక్ష పదవికి సిఫారసు చేశారట. మరోవైపు చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి మాత్రం సీనియర్ నాయకుడైన తనకు అధ్యక్ష పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారట.
అధ్యక్ష పదవికి న్యాయం చేయలేడన్న విమర్శలు..
ప్రస్తుత టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న అబ్దుల్ అజీజ్ ప్రస్తుతం వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు అబ్దుల్ అజీజ్ జిల్లా అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టారు. గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్ టీడీపీ టికెట్ ఆశించినప్పటికీ..చివరిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. అయితే అబ్దుల్ అజీజ్ జిల్లా అధ్యక్ష పదవికి న్యాయం చేయలేడన్న విమర్శలున్నాయి.
ఆయనకు పార్టీపై పట్టులేదని..కార్యకర్తలతో కూడా సత్సంబంధాలు లేవన్న ఆరోపణలున్నాయి. సమస్య వచ్చినప్పుడు జిల్లాలోని పార్టీ నాయకులందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంలోనూ.. క్రియాశీలకంగా వ్యవహరించలేకపోయారని టీడీపీలో ఓ వర్గం అసంతృప్తిగా ఉందట. ఆయన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటారని..జిల్లా పార్టీ ఆఫీస్‌వైపు కన్నెత్తి చూడటం లేదని గుసగుసలు పెట్టుకుంటున్నారట. అంతేకాక ఆయన వైసీపీ నుంచి వలస వచ్చిన నాయకుడు..కాబట్టి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రతిపాదనను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యతిరేకించారట.
మరోవైపు మంత్రి నారాయణ ..తన అనుచరుడైన పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌గా ఉన్న పట్టాభిరామిరెడ్డికి టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి ఇప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారట. గతంలో పట్టాభి రామిరెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటమి చెందారు. అయితే ఇతనికి కూడా పార్టీపై పట్టు లేదట. కార్యకర్తలు, నాయకులతో సత్సంబంధాలు లేవట.
ఇక పార్టీకి చెందిన మరో సీనియర్ నేత, పార్టీనే నమ్ముకుని పార్టీకి లాయల్‌గా పని చేస్తున్న చేజర్ల వెంకటేశ్వర్‌రెడ్డి తనకే అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతున్నారట. ఇతను పార్టీలోని నాయకులందరితోనూ సత్సంబంధాలు కలిగి ఉన్నారట. ఇలా ముగ్గురు నేతలు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు.
వలస వచ్చిన నేతలకు పదవులు వద్దు..!
మరోవైపు వలస వచ్చిన నేతలకు పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టకూడదని కొందరు వాదిస్తున్నారట. టీడీపీ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి వలస వచ్చారు. ఆయనతో పాటు మరో ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వైసీపీ నుంచి వలస వచ్చిన నేతలే. ఇలా వలస వచ్చిన నేతల డిమాండ్‌కు ప్రాధాన్యత ఇవ్వకూడదని టీడీపీ లీడర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. పార్టీని నమ్ముకుని చాలామంది ఉన్నారని.. పార్టీ కోసమే పనిచేసే వారికే పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలో నారాయణ, ఎంపీ వేమిరెడ్డి వర్గంలో ఎవరికి జిల్లా అధ్యక్ష పదవి దక్కబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది.