Ysrcp Social Media Activist : వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త ప్రవీణ్ కుమార్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూటమి నాయకులపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యాడు ప్రవీణ్. సోషల్ మీడియాలో వినాయక మండపాలకు సంబంధించి కూటమి నేతలపై ప్రవీణ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు పోస్ట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సంతనూతలపాడు పోలీస్ స్టేషన్ లో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రవీణ్ కు 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. దీంతో విచారణ నిమిత్తం పోలీసుల ఎదుట హాజరయ్యాడు ప్రవీణ్.
”అన్నీ ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే అవకాశం ఉన్న నేరాలు కాబట్టి.. అర్నేశ్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే జడ్జిమెంట్ ను అనుసరించి ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులు అన్నింటిలోనూ 41 సీఆర్పీసీ నోటీసులు ఇవ్వమని సుప్రీంకోర్టు గతంలోనే ఉత్తర్వులు ఇచ్చింది. దాన్ని అనుసరించి ప్రవీణ్ కు స్టేషన్ బెయిల్ ఇవ్వాలని రిక్వెస్ చేసేందుకు సీఐని కలిసి విన్నవించుకున్నాం” అని ప్రవీణ్ తరపు లాయర్ చెప్పారు.
అనుచిత పోస్టులపై వివరణ ఇవ్వాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. దాంతో ప్రవీణ్ ఇవాళ మధ్యాహ్నం పులివెందుల నుంచి ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. పోలీసులు కోరిన దానిపై అతడు వివరణ ఇచ్చాడు. పలు ప్రశ్నలు వేసిన పోలీసులు వాటికి వివరణ కోరినట్లు తెలుస్తోంది. అయితే, ప్రవీణ్ ను పోలీసులు ఎటువంటి ప్రశ్నలు అడిగారు, అతడు ఏం చెప్పాడు? అనేది పోలీసులు బహిర్గతం చేయలేదు.
ప్రవీణ్ వ్యక్తిగతంగానే అనుచిత పోస్టులు పెట్టాడా? లేక దీని వెనుక ఎవరైనా ఉన్నారా? వైసీపీ నాయకులు ఎవరైనా ప్రవీణ్ వెనక ఉన్నారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఎంక్వైరీ తర్వాత ప్రవీణ్ ను పోలీసులు వదిలేస్తారా? మరోసారి విచారణకు పిలుస్తారా? లేక అరెస్ట్ చేస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. అటు ప్రవీణ్ వెంట లాయర్ కూడా ఉన్నారు. బెయిల్ కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. 41 ఏ నోటీసు ప్రకారం.. వివరణ ఇచ్చాక, విచారణ అనంతరం కచ్చితంగా స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిందేనని ప్రవీణ్ తరపు లాయర్ చెబుతున్నారు.
Also Read : వరుస పెట్టి వైసీపీకి సినీనటుల గుడ్ బై.. థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారంటూ వణికిపోతోన్న ఆర్జీవీ