బాబుకైనా, జగన్‌కైనా వీరే పెద్ద ప్రమాదం!

  • Publish Date - December 28, 2019 / 10:57 AM IST

అధికారంలో ఉన్నప్పుడు అధినేత ఈ నిర్ణయం తీసుకున్నా సూపరో సూపర్‌ అనడం పార్టీలో ఉండే ఎమ్మెల్యేలకు, నేతలకు అలవాటే. అధినేత నిర్ణయం సరైనది కాకపోయినా కూడా ఆయన తానా అంటే వారంతా తందానా అంటూ మెప్పు కోసం తాపత్రయ పడడం కూడా కామనే. అది చంద్రబాబు హయాంలో అయినా.. జగన్‌ హయాంలో అయినా ఆ పార్టీల ఎమ్మెల్యేల తీరు మాత్రం మారడం లేదు. పార్టీ అధినేత ఒక నిర్ణయం తీసుకుంటే గుడ్డెద్దు చేలో పడ్డట్టు సమర్థించడమే తప్పా.. దానిపై తమ అభిప్రాయాలను నిస్సంకోచంగా చెప్పేందుకు ఏ ఎమ్మెల్యే ప్రయత్నించని పరిస్థితులున్నాయి. 

ఇప్పుడు రాజధాని విషయంలో సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలు అదే విధంగా సమర్థిస్తున్నారు. దీనివల్ల రాష్ట్రానికి ఎలాంటి మేలు జరుగుతుందో… అసలు అభివృద్ధి వికేంద్రీకరణకు, పరిపాలన వికేంద్రీకరణకు ఉన్న తేడాపై చర్చించేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. పార్టీ అధినేతకు తమ అభిప్రాయాలను తెలిపే ప్రయత్నాలే జరగడం లేదు. గతంతో చంద్రబాబు హయాంలోనూ ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇలానే చేశారు. దీంతో ఆ పార్టీకి తీరని నష్టం కలిగిందని చెబుతున్నారు. 

పార్టీ నిర్ణయాన్ని కాదనలేక :
రాజధాని విషయంలో జగన్‌ తీసుకున్న నిర్ణయంతో మూడు జిల్లాల్లోని వైసీపీ ఎమ్మెల్యేలకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు ఇరకాట పరిస్థితుల్లో ఉన్నా కూడా నోరు మెదపలేక పోతున్నారని అంటున్నారు. నిజానికి ఈ జిల్లాల్లో ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాలో ప్రజాప్రతినిధులు రాజధాని విషయంలో లోలోపల మధనపడిపోతున్నారట.

కానీ, బయటకు మాత్రం కనపడనీయడం లేదు. ముఖ్యమంత్రి, అందులోనూ పార్టీ అధినేత నిర్ణయం కావడంతో అసలు విషయంలో ఇక ఏం మాట్లాడేది లేదని ఫిక్సయిపోయారంట. ఈ మూడు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేల్లో మెజారిటీ సభ్యులకు ఇక్కడ నుంచి రాజధానిని తరలించడం ఇష్టం లేదనే టాక్‌ ఉంది. కానీ, పార్టీ నిర్ణయాన్ని కాదనలేకపోతున్నారు. 

అధికారంలో ఉన్న పార్టీ కావడంతో టీడీపీలో నేతల్లా ప్రాంతాల వారీగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే పరిస్థితులు లేవని జనాలు అనుకుంటున్నారు. అప్పటికీ ఎమ్మెల్యే గోపిరెడ్డి లాంటి వారు తొలుత తన అభిప్రాయాన్ని జగన్‌ నిర్ణయంతో విభేదించాలనే వ్యక్తం చేశారు. కానీ, ఆ తర్వాత వచ్చిన ఒత్తిళ్లతో మాట మార్చేశారు. నాయకులకు అలవాటైన భాషలో ఇదంతా మీడియా వక్రీకరణ అని చాలా ఈజీగా చెప్పేశారు. చాలా మంది నేతల మదిలో కూడా ఇదే ఉంది. రాజధానిని అమరావతిలో ఉంచాలని మూడు జిల్లాల్లోని ఎమ్మెల్యేల మనసులో ఉంది. కానీ, ఎదురు చెప్పలేక మౌనంగా ఉండిపోతున్నారు. 

అధినేతలు దెబ్బయిపోతారు :
గత ప్రభుత్వంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలకు కూడా ఇట్టాగే గుడ్డిగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమర్థిస్తూ వచ్చారు. మోదీని చంద్రబాబు సూపర్‌ అంటే ఎమ్మెల్యేలూ సూపరన్నారు. మోదీ నియంత అని అంటే ఔనంటూ తలాడించారు తెలుగుదేశం నేతలు.

చంద్రబాబు నోటి నుంచి ప్రత్యేక హోదా అని వస్తే.. ఔనౌను ప్రత్యేక హోదా కావాల్సిందే అన్నారు.. ఆ తర్వాత బాబు ప్యాకేజీకి ఓకే అంటే… ఎస్‌ ప్యాకేజీతోనే లాభం అన్నారు. ఇవన్నీ కూడా ప్రజల్లో నెగెటివ్‌ ఫీలింగ్‌ కలిగించాయి. అప్పటికప్పుడు ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయకపోవచ్చు.. కానీ, సమయం వచ్చినప్పుడు మాత్రం గుర్తు పెట్టుకొని మరీ బుద్ధి చెప్తారు. 

గత ఎన్నికల్లో అదే జరిగింది. బాబును చిత్తుగా ఓడించారు. ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం విషయంలోనూ ఎమ్మెల్యేలు అదే తీరుగా వ్యవహరిస్తున్నారు. జగన్‌ నిర్ణయాలను సమర్థిస్తున్న వారే తప్ప దానిపై డిస్కస్‌ చేసే ఎమ్మెల్యేలే కనిపించడం లేదు. ఈ విషయంలో అధినేతలు జాగ్రత్త వహించకపోతే దెబ్బయిపోతారని జనాలు అంటున్నారు. అదే విధంగా పార్టీ తీవ్రస్థాయిలో నష్టపోయే పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా చంద్రబాబునే చూపిస్తున్నారు.