Pawan Kalyan: మహిళల కట్టుబొట్టుపై మాట్లాడతారా?.. మరీ ఇంతలా దిగజారాలా.. అమర్నాథ్ వ్యాఖ్యలపై పవన్ ఆగ్రహం
హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై వైకాపా నేత గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) తీవ్రంగా ఖండించారు.
- V Santhosh Kumar
- Updated on- June 16, 2026 / 12:54 PM IST
Pawan kalyan condemns gudivada amarnath remarks on vangalapudi anitha
- అమర్నాథ్ వ్యాఖ్యలను ఖండించిన పవన్.
- మహిళలను కించపరచడం తగదని హెచ్చరిక.
- గౌరవప్రదమైన భాషలోనే బదులివ్వాలని సూచన.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై వైకాపా నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) తీవ్రంగా ఖండించారు. మహిళల కట్టు, బొట్టును ఉద్దేశించి మాట్లాడే స్థాయికి వైకాపా నేతలు దిగజారిపోయారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు కేవలం మంత్రి అనితను మాత్రమే కాకుండా, సగటు మహిళలందరినీ కించపరిచేలా ఉన్నాయని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు అనేవి విధానపరంగానే ఉండాలని, ఇళ్లలోని స్త్రీలను లాగి నోటికొచ్చినట్లు మాట్లాడటం సంస్కారం కాదని హితవు పలికారు. ప్రజా జీవితంలో ఉన్నవారు మాట్లాడే ప్రతి మాటను సమాజం గమనిస్తోందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. మహిళల పట్ల మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరూ హద్దుల్లో ఉంటూ, జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.
వైకాపా నేతల దిగజారుడు వ్యాఖ్యలను కూటమి నాయకులు గట్టిగా తిప్పికొట్టాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. వారు ఉపయోగించే అభ్యంతరకర భాషను ప్రజల ముందు ఎండగట్టాలని సూచించారు. అయితే, కూటమి నేతలు కూడా అవతలి పార్టీ వారిలా దిగజారకుండా, పౌర సమాజం హర్షించే గౌరవప్రదమైన భాషలోనే బలంగా బదులివ్వాలని ఆయన స్పష్టం చేశారు.
