మనం త్యాగాలకు సిద్ధపడాలి : పవన్ కళ్యాణ్

  • Publish Date - January 26, 2020 / 05:51 AM IST

గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన పార్టీ ఆఫీస్ లో 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి పవన్ మాట్లాడారు. భారత దేశం గొప్ప దేశం అన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా.. మానవత్వానికి స్పందించే దేశం భారత్ అని కొనియాడారు. ఎందరో త్యాగాలతో మన దేశానికి స్వేచ్చ వచ్చిందన్నారు. ఈ జెండా వెనుక లక్షలాది ప్రాణత్యాగాలు ఉన్నాయన్నారు. మనం కూడా త్యాగాలకు సిద్ధంగా ఉండాలని పవన్ పిలుపునిచ్చారు. దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన వారి చరిత్ర తెలిస్తే.. ప్రతి ఒక్కరు దేశాన్ని ప్రేమిస్తారని పవన్ చెప్పారు. 

దేశ విభజన జరిగిన సమయంలో.. పాకిస్తాన్ ముస్లిం దేశంగా ప్రకటించుకుందని గుర్తు చేసిన పవన్.. భారత్ దేశం మాత్రం హిందూ దేశంగా ప్రకటించుకోలేదన్నారు. అదే మన దేశ గొప్పతనం అన్నారు. మన దేశం గొప్పదనం సెక్యులరిజం అని పవన్ చెప్పారు. అన్ని మతాలకు, కులాలకు సమానంగా గౌరవం లభిస్తుందన్నారు. సర్వ మతాలకు గౌరవం ఇచ్చే దేశం భారత్ అన్నారు. హిందూయిజం మన జీవన విధానం అని చెప్పారు.

గొప్ప నాయకులు పుట్టిన దేశం భారత్ అని కొనియాడారు. గణతంత్ర దినోత్సవం అంటే.. ఏడాదికి ఒకసారి జెండా ఎగరేయడం, వందనం చేయడం కాదన్నారు పవన్. పోరాటయోధుల త్యాగాల గురించి, చరిత్ర గురించి తెలుసుకుంటే.. ప్రతి ఒక్కరూ దేశాన్ని ప్రేమిస్తారని పవన్ చెప్పారు.

Also Read : 3 రాజధానులపై ఏపీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు