Pawan Kalyan : ఓటమి భయంతోనే.. మూడు రాజధానుల నిర్ణయం వెనక్కి

హైకోర్టు నుంచి తప్పించుకోడానికే హడావిడి నిర్ణయం తీసుకుందని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన సీఎం జగన్

Pawan Kalyan : మూడు రాజధానుల నిర్ణయం రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. హైకోర్టు నుంచి తప్పించుకోడానికే హడావిడి నిర్ణయం తీసుకుందని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన సీఎం జగన్, మరింత స్పష్టతతో కొత్త బిల్లును సభలో ప్రవేశపెడతామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరింత గందరగోళంలోకి నెట్టేశారని పవన్ అన్నారు.

రాజధాని అమరావతికి సంబంధించి 54 కేసుల్లో చురుకుగా హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఓటమి తప్పదని భావించిన జగన్ ప్రభుత్వం తాత్కాలికంగా కోర్టు నుంచి తప్పించుకోడానికి బిల్లులను రద్దుకు ఉపక్రమించిందని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా భావిస్తున్నారని పవన్ చెప్పారు. కోర్టు తీర్పుతో ఈ గందరగోళానికి తెరపడుతుందని భావిస్తున్న తరుణంలో జగన్ ప్రభుత్వం మరో కొత్త నాటకానికి తెర తీసిందన్నారు.

Bike Start Problem : హలో భయ్యా.. మీ బైక్ స్టార్ట్ కావడం లేదా? ఈ ట్రిక్ ట్రై చేయండి!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఏడున్నరేళ్లు అవుతున్నా రాజధాని ఎక్కడుంటుందో తెలియని స్థితికి ఈ పాలకులు తీసుకొచ్చారని పవన్ ధ్వజమెత్తారు. వికేంద్రీకరణతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని వివిధ రాష్ట్రాలను ఉదాహరణగా చిలకపలుకు పలుకుతున్న పాలకులు ఏ రాష్ట్రంలోనూ రెండు మూడు రాజధానులు లేవన్న సంగతిని విస్మరించారని పవన్ అన్నారు. మూడు రాజధానులు ఏర్పాటుతోనే అభివృద్ది వికేంద్రీకరణ జరుగుతుందన్న భ్రమలోనే వైసీపీ పెద్దలు మునిగి తేలుతున్నారని విమర్శించారు. రాజధానిగా అమరావతి ఏర్పాటుపై శాసనసభలో నాడు జరిగిన చర్చలో నాటి ప్రతిపక్ష నేతగా పాల్గొని ప్రసంగించిన జగన్.. తాను ఆనాడు ఏం చెప్పారో అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారని పవన్ మండిపడ్డారు.

33వేల ఎకరాల్లో రాజధాని నిర్మించాలంటే మౌలిక వసతులకు తక్కువలో తక్కువ లక్ష కోట్లు అవసరమవుతాయని, అది వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారమని, మహారాష్ట్ర రాజధాని ముంబై కూడా ఇంత విస్తీర్ణంలో లేదని ఇప్పుడు చెబుతున్న జగన్… కనీసం 30 వేల ఎకరాల్లో కన్నా తక్కువలో రాజధాని ఏర్పాటు చేయరాదని నాడు అసెంబ్లీలో చెప్పిన మాటలు అధికారంలోకి రాగానే మరచిపోయారని అన్నారు.

Airtel Prepaid Price Hike : ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్.. ప్రీ‌పెయిడ్ ఛార్జీల పెంపు..!

రాజధాని కోసం రోడ్డెక్కిన రైతులను లాఠీ ఛార్జీలు చేసి భయోత్పాతానికి గురి చేశారని, రాజధాని కోసం భూములిచ్చిన రైతులపై 3వేలకు పైగా కేసులు పెట్టారని, మహిళలపై కూడా కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారని పవన్ అన్నారు. రాష్ట్రంలోని రాజకీయ పక్షాలన్నీ ఒకే రాజధాని చాలని ఒకే మాటపై నిలవగా ఒక్క వైసీపీ మాత్రమే మూడు రాజధానుల పాట పాడుతోందన్నారు.

రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు ఇచ్చి త్యాగనిరతిని చాటిన అమరావతి రైతులకు జనసేన బాసటగా ఉంటుందని పవన్ మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు రాష్ట్రమంతటికీ విస్తరించాలని, రాజధాని మాత్రం అమరావతి ఒక్కటే ఉండాలని జనసేన కోరుకుంటోందన్నారు. తాత్కాలిక ప్రయోజనంతో కాకుండా దూరదృష్టితో రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న సంపూర్ణ రాజధాని ఆవిర్భావానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నదే జనసేన డిమాండ్ అన్నారు.

మూడు రాజధానుల బిల్లుని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్లు సీఎం జగన్‌ అసెంబ్లీలో ప్రకటన చేశారు. అయితే, మూడు రాజధానుల అంశంలో మార్పు లేదని, కొన్ని మార్పులతో మళ్లీ కొత్త బిల్లు తీసుకొస్తామని సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతానికి వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులను వెనక్కి తీసుకుంటున్నామని వెల్లడించారు. విస్తృత, విశాల ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.

అయితే మూడు రాజధానులపై తమ నిర్ణయం మారదని, ఈ బిల్లును మరింత మెరుగుపరిచి, సమగ్రమైన బిల్లుగా ముందుకు తెస్తామని సీఎం జగన్ చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలకు సంపూర్ణంగా వివరించేలా బిల్లును నవీకరిస్తామని తెలిపారు. కొత్త బిల్లుపై అన్ని వర్గాల ప్రజలను ఒప్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు. చట్టపరంగా,
న్యాయపరంగా అన్ని సందేహాలకు ఈ కొత్త బిల్లు ద్వారా సమాధానమిస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు.

మూడు రాజధానులపై వెనక్కి తగ్గబోమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. మూడు రాజధానులపై టీడీపీ దుష్ప్రచారం చేసిందని ఆయన ఆరోపించారు. వికేంద్రీకరణే సరైనదని తాము నమ్ముతున్నామని, అదే వైసీపీ ప్రభుత్వ విధానమని వెల్లడించారు. బిల్లుల ఉపసంహరణ నిర్ణయం ఎవరికీ భయపడి తీసుకున్నది కాదని, తాము చిత్తశుద్ధితో నిర్ణయం తీసుకున్నామని బొత్స స్పష్టం చేశారు. చట్ట, న్యాయపరమైన అంశాలకు పరిష్కారాలు తెస్తామని, అందరి అపోహలు, అనుమానాలు తీరుస్తామని చెప్పారు. మరింత మెరుగైన బిల్లుతో మళ్లీ ముందుకొస్తామని వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు