Pawan Kalyan responds on student murder : గాజువాకలో విద్యార్థినిపై ప్రేమోన్మాది దాడి, హత్య ఘటన బాధాకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విద్యార్థిని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కొద్ది రోజుల క్రితం విజయవాడలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై ఓ ఉన్మాది కత్తితో దాడి చేసి హత్య చేసిన దుర్మార్గాన్ని ఎవరు మరచిపోలేదన్నారు. ఇప్పుడు గాజువాకలో అదే తరహా ఉన్మాదపు హత్య చోటు చేసుకోవడం దారుణమని పేర్కొన్నారు. ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థినులు, యువతులు, మహిళలకు రక్షణ కల్పించే విషయంలో ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరించకూడదన్నారు.
దిశ చట్టం చేశాం, దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశామని ప్రకటనలు చేసి ప్రచారం చేసుకున్న పాలకులు రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న నేరాలపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. చట్టాలు చేసి చేతులు దులుపుకుంటే ఫలితం రాదని, ఆ చట్టం ఇప్పటికీ అమల్లోకి రాకపోవడానికి కారణలేమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థినులకు ఆత్మ రక్షణ విద్యలు తప్పనిసరి చేయాలని పేర్కొన్నారు. అదే విధంగా యవతులు, మహిళలకు ఆత్మ రక్షణ మెళకువలు నేర్పాలన్నారు. విద్య, స్త్రీ శిశు సంక్షేమ, హోం శాఖలు సంయుక్తంగా ఇందుకు సంబంధించి నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టలని సూచించారు.