Pawan Kalyan third time Varahi Yatra
Pawan Kalyan third time Varahi Yatra : జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడో విడత వారాహి యాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు విడతల వారాహి యాత్రను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న జనసేనాని ఇక మూడో విడత యాత్రకు సిద్ధమవుతున్నారు. విశాఖ నుంచి మూడో విడత వారాహి యాత్రకు పవన్ కల్యాణ్ సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే రెండో విడతల యాత్రలో ఆయా నియోజక వర్గాల YCP నేతలపై విమర్శలు సంధించి ఏపీలో కాకపుట్టించిన పవన్ ఈసారి విశాఖ నుంచి ప్రారంభించి మాటల తూటాలు పేల్చనున్నట్లుగా సమాచారం. మరి ఈ సారి ఇంకెంత హీటెక్కిస్తారో వేచి చూడాలనే ఉంది.
గురువారం (జులై 10,2023) నుంచి ఆగస్టు 19 వరకు మూడో విడత వారాహి యాత్ర జరుగనుంది. రేపటినుంచి వారాహి యాత్రకు సిద్ధమవుతున్న పవన్ ఈరోజే విశాఖ చేరుకోనున్నారు. దీంట్లో భాగంగా రేపు జగదాంబ జంక్షన్ లో సభ నిర్వహించేందుకు జనసేన శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. గత రెండు విడతల యాత్రను మించి మూడో విడత యాత్రను సక్సెస్ చేయాలని జనసేన భావిస్తోంది.
యాత్రను పర్య వేక్షించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది.
ఈ యాత్రలో పవన్ కల్యాణ్ విశాఖలో జరుగుతున్న భూకబ్జాలకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలనలు చేపడతారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. పర్యావరణానికి నష్టం కలిగించేలా ధ్వంసం చేసిన ప్రాంతాలను కూడా పవన్ కల్యాణ్ సందర్శించనున్నారని జనసేన వర్గాలు తెలిపాయి. మరి ఈ సందర్శనలు జరుగుతాయా..? లేదా ఏమన్నా మార్పులు ఉండనున్నాయా అనే విషయం తెలియాల్సి ఉంది.
పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్రకు సంబంధించి కమిటీలతో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశం నిర్వహించారు. యాత్ర తీరుతెన్నులపై నేతలతో చర్చించారు. విశాఖలో జరుగుతున్న భూ కబ్జాల గురించి కూడా పవన్ వివరాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. మరి ఇక మూడో విడత వారాహి యాత్రలో పవన్ ఈ టాపిక్ పై మరోసారి కాకపుట్టించనున్నట్లుగా సమాచారం.
రెండో విడత యాత్రలో భాగంగా పవన్ వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థలపై చేసిన వ్యాఖ్యలు ఏపీలో పెను దుమారాన్ని రేపాయి. ఆ వేడి ఇంకా తగ్గనే లేదు. ఈక్రమంలో విశాఖలో జరుగుతన్న భూ కబ్జాల గురించి పవన్ ఆరోపణలు చేస్తే ఇక ఈ హీట్ ఇంకెంతగా ఉంటుందో వేచి చూడాలి.