Pawan Kalyan to go to amaravati in the wake of Chandrababu Arrest
Pawan Kalyan -Chandrababu Arrest: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో అమరావతికి రానున్నారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు స్పెషల్ ప్లైట్ (Special Flight) లో గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారని జనసేన పార్టీ (Janasena Party) వర్గాలు వెల్లడించాయి. స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమాల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హుటాహుటిన అమరావతికి వస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలిసే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. అయితే చంద్రబాబును కలిసేందుకు సీఐడీ అధికారులు అనుమతిస్తారా, లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు అరెస్ట్ ను ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఖండించారు. ప్రాథమిక ఆధారాలు చూపించకుండా అర్థరాత్రి అరెస్టు చేయడాన్ని సంపూర్ణంగా ఖండిస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆరోపించారు.
హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి ఈ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో చేరుకుంటారు. తర్వాత మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకుని, సీనియర్ నాయకులతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీలో తలెత్తిన పరిస్థితులపై జనసేనాని చర్చించనున్నారని సమచారం. కాగా, ఈ మధ్యాహ్నం తర్వాత చంద్రబాబును పోలీసులు విజయవాడకు తీసుకువస్తారు. వైద్య పరీక్షల తర్వాత ఆయనను కోర్టులో హాజరుపరిచే అవకాశముంది.
ఇంద్రకీలాద్రికి నారా భువనేశ్వరి
కాగా, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.. విజయవాడ ఇంద్రకీలాద్రికి వచ్చారు. తన భర్త చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో భువనేశ్వరి.. దుర్గమ్మ వారి దర్శనానికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. భువనేశ్వరి వెంట ఆమె సోదరుడు నందమూరి రామకృష్ణ ఉన్నారు. కాగా, విజయవాడలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యనాయకులకు ముందుగానే హౌస్ అరెస్ట్ చేశారు.
Also Read: చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కుట్రే, రెండేళ్ల క్రితం అవినీతి జరిగితే ఛార్జ్ షీట్ ఏది..?: బాలకృష్ణ