PawanKalyan-JanaSena: ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు చేరారు. అలాగే, భీమిలి వైసీపీ నేతలు చంద్ర రావు, అక్కరామని దివాకర్ కూడా జనసేనలో చేరి ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.
అనంతరం పార్టీ కార్యాలయంలో కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో పవన్ కల్యాణ్ సమావేశం నిర్వహించారు. హరి రామ జోగయ్య ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కాపు సంక్షేమ సేన ప్రతినిధులు వచ్చారు. కాపు రిజర్వేషన్, కాపు ముఖ్యమంత్రి అభ్యర్థి, కాపులకు రాజ్యాధికారం, కాపు సమాజంలోని సమస్యలు వంటి అంశాలపై నేతలు చర్చిస్తున్నారు.
కాగా, పవన్ కల్యాణ్ రేపు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలుస్తారు. గవర్నర్ గాఅబ్దుల్ నజీర్ ఇటీవల బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను పవన్ కల్యాణ్ మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఏపీలో ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉండడంతో జనసేన తమ పార్టీని బలపర్చుకోవడానికి ప్రణాళికలు వేసుకుంది.