Pedakakani : గుంటూరు జిల్లా పెదకాకానిలో హైటెన్షన్.. అమ్మవారికి మంగళసూత్రం విషయంలో వైసీపీ, టీడీపీ మధ్య రగడ!

Pedakakani Mallikarjuna Swamy Temple : గుంటూరు జిల్లా పెదకాకాని మల్లేశ్వర స్వామి దేవస్థానంలోని భ్రమరాంబ అమ్మవారి మంగళసూత్రం మాయం వ్యవహారంపై వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్తత వాతావరణంచోటు చేసుకుంది.

Pedakakani Mallikarjuna Swamy Temple

Pedakakani Mallikarjuna Swamy Temple : గుంటూరు జిల్లా పెదకాకాని మల్లేశ్వర స్వామి దేవస్థానంలోని భ్రమరాంబ అమ్మవారి మంగళసూత్రం మాయం కేసులో నిందితుడు కొండవీటి రణధీర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలాఉంటే.. ఈ ఘటనలో వైసీపీ, టీడీపీ మధ్య రగడ తారాస్థాయికి చేరింది. అమ్మవారికి నాంతాడు కానుకగా సమర్పించేందుకు వైసీపీ నేతలు సిద్ధమవ్వగా.. టీడీపీ నేతలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పెద్దకానిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

Also Read : Gold Silver Price Today : బంగారం కొనేవాళ్లకు అలర్ట్.. ఊహించని మార్పులు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..

పెద్దకాకాని మల్లేశ్వరస్వామి దేవస్థానంలోని భ్రమరాంబ అమ్మవారి మంగళసూత్రం మాయం కేసులో సీసీ కెమెరా పుటేజీని పరిశీలించిన పోలీసులు.. ఆ తరువాత రణధీర్ అనే వ్యక్తిని అనుమానిస్తూ విచారించారు. అతని ఇంట్లో తనిఖీలు చేయగా.. పడక గదిలో పరుపు తీయగా రెండు మంచాల మధ్యలోని ఖాళీ స్థలంలో అమ్మవారి మంగళసూత్రాన్ని గుర్తించారు. తొలుత తమకు సంబంధం లేదని చెప్పినా.. అంతకుముందు సేకరించిన కీలక ఆధారాలను పోలీసులు వారి ముందుంచడంతో.. మంగళసూత్రం భ్రమరాంబ అమ్మవారిదని ఒప్పుకున్నారు. దీంతో రణధీర్ ను పోలీసులు అరెస్టు చేశారు.

అమ్మవారి మంగళసూత్రం మాయం వ్యవహారం టీడీపీ, వైసీపీ నేతల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అమ్మవారి మంగళసూత్రం మాయంపై వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. పెదకాకాని శ్రీభ్రరాంబ అమ్మవారికి నాంతాడు కానుకగా సమర్పించేందుకు పొన్నురు వైసీపీ ఇన్‌ఛార్జ్ అంబటి మురళీకృష్ణ, వైసీపీ శ్రేణులు సిద్ధమయ్యారు. వారిని అడ్డుకునేందుకు టీడీపీ నేతలు సిద్ధం కావడంతో పెద్దకాకాని ఆలయం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

వైసీపీ నేత మల్లాది విష్ణు కారును టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కొద్దిసేపటి తరువాత పోలీసులు జోక్యం చేసుకొని మల్లాది విష్ణును పెద్దకాకాని వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. ఇప్పటికే అమ్మవారి మంగళసూత్రం మాయం ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అయినా, వైసీపీ రాద్దాంతం చేస్తుందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించిన అంబటి మురళీ కృష్ణ క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు.

అమ్మవారికి మంగళసూత్రం ఇచ్చి తీరుతామని అంబటి మురళి, వైసీపీ శ్రేణులు ఆలయం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వైసీపీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.