Protest
Polavaram Flood Villages : తెలుగు రాష్ట్రాల మధ్య ఐదు గ్రామాల రగడ రగులుతూనేవుంది. పోలవరం ముంపు గ్రామాల్లో హైటెన్షన్ నెలకొంది. ఓ వైపు ముంపు గ్రామాల ప్రజలు.. మరోవైపు సీఆర్పీఎఫ్ బలగాలతో.. ఐదు గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. తెలంగాణలో కలపాలంటూ ఏపీలోని ఐదు గ్రామాల ప్రజల ఆందోళన మరోసారి ఆందోళనకు దిగారు. భద్రాచలానికి ఆనుకుని ఉన్న ఐదు గ్రామాలు పిచ్చుకలపాడు, పురుషోత్తమ పట్నం, ఎటపాక, గుండాల, కన్నాయిగూడెంలను తిరిగి తెలంగాణలో కలపాలని కోరుతున్నారు. ఒకే చోట వంటావార్పుకు 5 గ్రామాల ప్రజలు పిలుపిచ్చారు. ముంపు గ్రామాల ప్రజల ఆందోళనను ఏపీ సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. పోలవరం ముంపు గ్రామాల్లో సీఆర్పీఎఫ్ బలగాల మోహరించింది. వంటావార్పులు, ర్యాలీలకు అనుమతి లేదని ఏపీ సర్కార్ చెబుతోంది. భద్రాచలం వేదికగా ఆందోళన చేస్తామని ముంపు గ్రామల ప్రజలు హెచ్చరిస్తున్నారు.
భద్రాచలం వరద ముంపుతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తమ ప్రాంతాన్ని తెలంగాణలో కలపాలి అని అప్పుడెప్పుడో ఉద్యమం సమయంలో వినిపించిన మాట.. మళ్లీ ఇప్పుడు వినిపిస్తోంది. అసలు ఆ ఐదు గ్రామ పంచాయతీల ప్రజలు ఏమంటున్నారు.. వారి ప్రధాన డిమాండ్లు ఏంటి..? తెలంగాణలో కలిపి తీరాల్సిందేనని పట్టిన పట్టు వారు ఎందుకు వీడడం లేదు..? రాష్ట్ర విభజన తర్వాత ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపినా.. 2008లోనే ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి… ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ భూములకు.. ఇంటి నిర్మాణం కోసం కేటాయించారు. అయితే ప్యాకేజీ జాబితాలో ఈ ఐదు పంచాయతీలు లేవు. ఇది వారి ప్రధాన సమస్య. దీంతో పాటు ఐదు గ్రామ పంచాయతీల జనాలు.. తమ గ్రామాలకు చెందిన విద్యార్థులు.. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు వారి గ్రామాల్లో చదివి.. ఆ తర్వాత ఆరు నుంచి పదో తరగతి వరకు భద్రాచలం పట్టణం లేదా దుమ్ముగూడెం మండలం నరసాపురం గ్రామానికి వెళ్తారు. దీంతో వీరికి స్థానిక విషయంలోనూ రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి.
Merged Villages: పోలవరం ముంపు గ్రామాలు మళ్లీ తెలంగాణలోకి?
ఈ ఐదు గ్రామ పంచాయతీలకు.. భద్రాచలం నియోజకవర్గ కేంద్రం ఒకటి నుంచి 9 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇక కొత్తగూడెం జిల్లా కేంద్రం 40కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ఇప్పుడు ఏపీలో కలపడంతో నియోజకవర్గ కేంద్రమైన రంపచోడవరం 120కిలోమీటర్ల దూరం అవుతోంది. ఇక జిల్లా కేంద్రమైన పాడేరు 480 కిలోమీటర్లు దూరం ఉంది. అక్కడికి వెళ్లాలంటే.. అంత దూరం రెండు ఘాటు రోడ్లు దాటుకొని వెళ్లాలి. ఇలాంటి పరిస్థితుల్లో తమ పంచాయతీలను… తెలంగాణలో కలపాలని గత ఎనిమిదేళ్లుగా ఈ ఐదు గ్రామాల ప్రజలు పోరాటం చేస్తున్నారు. వరద సమయంలోనూ ఈ ఐదు పంచాయతీలు… భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉండడంతో.. ఏపీ అధికారులకు రూట్ మ్యాప్ అర్థం కాలేదు. తెలంగాణ అధికారులు, ప్రజాప్రతినిధులే సేవలు అందించిన పరిస్థితి.
ఎటపాక దగ్గర గోదావరి వరద… కరకట్ట పైకి ప్రవహించడంతో స్థానికులు ఇసుక బస్తాలు వేసి వరదను ఆపారు. దీంతో భద్రాచలం పట్టణానికి భారీ ప్రమాదం తప్పింది. కరకట్ట పై నుంచి వరద ప్రవాహం జరిగి ఉంటే ఎటపాక గ్రామంతో పాటు.. రాజుపేట కాలనీ నుంచి భద్రాచలం పట్టణంలోకి వరద నీరు పెద్దఎత్తున వచ్చి తీవ్రనష్టం కలిగించేది. ఐతే ఎటపాక ఏపీ పరిధిలో ఉండడంతో.. కరకట్ట ఎత్తు పెంచాలన్నా.. మరమ్మతులు చేయాలన్నా… తెలంగాణ ప్రభుత్వానికి సాధ్యం కాని పరిస్థితి. దీంతో తమ ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలనే డిమాండ్.. స్థానికుల నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తోంది.
Polavaram project : పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై ఏపీ,తెలంగాణ మంత్రుల మధ్య ఆరోపణలు
ఎనిమిదేళ్లుగా భద్రాచలంలో సరైన స్థలం లేకపోవడంతో.. పట్టణంలో సేకరించిన చెత్తను గోదావరి నదిలో వేస్తున్నారు. ఇది కూడా ఐదు గ్రామాలకు ఇబ్బందిగా మారుతోంది. తమ గ్రామాలను తెలంగాణలో కలిపేవరకు ఆందోళనలు ఆపేది లేదని.. ఐదు గ్రామాల ప్రజలు తెగేసి చెప్తున్నారు. అప్పటివరకు ఆందోళనలు ఆపేది లేదని కుండబద్దలు కొడుతున్నారు. ఏమైనా నాటి అధికారుల అనాలోచిత నిర్ణయం.. ఐదు గ్రామాలు ఎనిమిదేళ్లుగా ఇబ్బంది పడేలా చేస్తోంది. ఇప్పటికైనా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు.. కేంద్రం దృష్టి సారించి.. తమ సమస్యకు పరిష్కారం చూపించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు.