సూర్యగ్రహణం సమయంలో దేశంలోని పలు ప్రాంతాల్లో వింత ఆచారాలు, పోకడలు, మూఢ నమ్మకాలు కనిపించాయి. గ్రహణం సమయంలో అరిష్టం జరక్కుండా మహిళలు ప్రత్యేక
సూర్యగ్రహణం సమయంలో దేశంలోని పలు ప్రాంతాల్లో వింత ఆచారాలు, పోకడలు, మూఢ నమ్మకాలు కనిపించాయి. గ్రహణం సమయంలో అరిష్టం జరక్కుండా మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. జిల్లెడు చెట్టుకి తాయొత్తులు కట్టారు. మరోవైపు సూర్యగ్రహణం సందర్భంగా రోకలి బండను నిటారుగా నిలబెట్టి కొన్ని ప్రాంతాల్లో పూజలు చేశారు. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం కె.కొత్తవలస గ్రామస్తులు ఇలా ప్రత్యేక పూజలు చేశారు. గ్రహణం పట్టు, విడుపులకు సంకేతంగా పూర్వకాలంలో రోకలి ఉపయోగించే వారని, అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు.
గ్రహణాన్ని సోలార్ ఫిల్టర్లతో చూస్తారు. కానీ, రంగారెడ్డి జిల్లా వెలిమినేడు, మేడిపల్లిలో తాంబాలంలో నీళ్లు పోసి, రోకలిని నిలబెట్టి సూర్యగ్రహణం చూశారు. నిలబెట్టిన రోకలి కింద పడితే సూర్యగ్రహణం ముగిసినట్లుగా వారు భావిస్తారు. తమ పూర్వీకులు గ్రహణ పట్టు విడుపులు ఇలాగే తెలుసుకునే వాళ్లని గ్రామస్తులు చెబుతున్నారు. నేటికీ ఇదే సంప్రదాయం కొనసాగిస్తున్నామని వివరించారు.
సూర్యగ్రహణాన్ని చూసేందుకు ఇంకా పాత పద్దతులనే పాటిస్తున్నారు గ్రామాల ప్రజలు. సూర్యగ్రహణం సందర్భంగా చీపురుపల్లి మండలం పెదనడిపల్లి గ్రామంలో రోకలిని నిట్టనిలువుగా నిలిపి గ్రహణాన్ని చూశారు. పూర్వీకుల నుంచి గ్రహణ స్థితిని తెలుసుకునేందుకు ఇదే పద్దతి పాటిస్తున్నామని గ్రామస్తులు చెబుతున్నారు.
Also Read : వైకల్యం పోతుందట : సూర్యగ్రహణం సమయంలో పిల్లలను పాతిపెట్టారు