Perni Nani On Chandrababu
Perni Nani: జనసేన అధినేత పవన్ కల్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుగుతూ తమపై సినిమా డైలాగ్ లు వదులుతున్నారని వైసీపీ నేత, ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఏప్రిల్ 1న అసత్యాలు, పరదూషణలతో అలౌకిక ఆనందం పొందారని పేర్ని నాని అన్నారు. ఏపీలోని తాడేపల్లిలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. 175కి 175 చోట్ల వైసీపీని ఓడిస్తానని చంద్రబాబు అంటున్నారని చెప్పారు.
అసలు 175 నియోజకవర్గాల్లో సైకిల్ గుర్తు ఉంటుందా? అని పేర్ని నాని అన్నారు. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీకి నిలబెట్టగలరా అని ప్రశ్నించారు. టీడీపీకి 38 నియోజక వర్గాల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉందని చెప్పారు. వైసీపీని ఓడించడం అనే సంగతి పక్కన పెట్టాలని… ముందు ఆ 38 చోట్లా క్యాండెట్లను వెతుక్కోవాలని ఎద్దేవా చేశారు. 175లో పవన్ కల్యాణ్ జనసేనకు ఎన్నిసీట్లిస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీలో టీడీపీ జెండా మోస్తున్న వారికి ఎన్ని సీట్లిస్తున్నారని నిలదీశారు.
కమ్యూనిస్ట్ పార్టీని తాకట్టు పెట్టిన నారాయణ, రామకృష్ణకు ఎన్ని సీట్లిస్తున్నారని పేర్ని నాని అన్నారు. అలాగే, కాంగ్రెస్ కు ఎన్ని సీట్లు ఇస్తున్నారని అడిగారు. 72 ఏళ్లు వచ్చాయి… ఇంకా ఉత్తర కుమారుడిలా ప్రగల్భాలెందుకని ప్రశ్నించారు. పదిమందిని కలుపుకుంటే కానీ పోటీచేయడానికి సాహసం చేయలేని దుస్థితి చంద్రబాబుదని చెప్పారు. వైనాట్ పులివెందుల అనే వారందరికీ ఇదే తన ఆహ్వానమని అన్నారు. చంద్రబాబు, పవన్ పులివెందులలో పోటీ చేయాలని సవాలు విసిరారు.
ఇద్దరూ విడివిడిగా పోటీ చేసినా.. ఒప్పందం చేసుకుని పోటీ చేసినా పర్వాలేదని చెప్పారు. దమ్ముంటే పులివెందులలో పోటీచేయాలని అన్నారు. 21 ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు జరిగితే నాలుగు గెలిచారని చెప్పారు. ఆ దానికే సంబరాలు జరుపుకోవడం ఎందుకని ప్రశ్నించారు. ఇక జన్మలో గెలుపు చూడలేరనే భావనతోనే ఈ సంబరాలు చేసుకుంటున్నారని చెప్పారు. చంద్రబాబు తన ఏజెంట్లతో జగన్మోహన్ రెడ్డిని నీచంగా దుర్భాషలాడిస్తున్నారని అన్నారు.
అమరావతి టెంట్ ఫ్యాన్సీ డేట్లలో అద్దె మైకులను తెచ్చి అసభ్య పదజాలం మాట్లాడిస్తున్నారని చెప్పారు. అమరావతి సభలో జగన్మోహన్ రెడ్డిపై కారుకూతలు కూయడం ధర్మమేనా అని ప్రశ్నించారు. కర్నూలులో రాజధాని పెట్టాలని అడిగింది పవన్ కల్యాణే కదా? అని అన్నారు. విశాఖకు అన్ని అర్హతలున్నాయన్నది కూడా పవన్ కల్యాణే అని అన్నారు. 2019 మేనిఫెస్టోలో ఏం చెప్పారో బీజేపీ నేతలు మర్చిపోయారా? అని అడిగారు. మరోవైపు, కమ్యూనిస్ట్ నేతలు వారి జెండాను టీడీపీకి తాకట్టు పెట్టారని అన్నారు.
అసలైన కమ్యూనిస్ట్ కార్యకర్తలు ఏడుస్తున్నారని పేర్ని నాని చెప్పారు. భూస్వాములకు వంతపాడటం దుర్మార్గం కాదా? అని అన్నారు. ఇది దిగజారుడు రాజకీయం కాదా అని నిలదీశారు. చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా, ఎంతమందిని పోగేసుకుని వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరని అన్నారు. 2024లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాబోతుందని చెప్పారు. ఆదినారాయణరెడ్డి దళిత వ్యతిరేకి అని అన్నారు.
బీజేపీలో ఉంటూ టీడీపీ జెండా మోస్తూ దళితులపై దాడులు చేయడం దుర్మార్గమని పేర్ని నాని చెప్పారు. అసత్యాలు చిమ్మడంలో చంద్రబాబుకు సిగ్గు, బిడియం లేదని అన్నారు. తెలంగాణకు, ఆంధ్రాకు తలసరి ఆదాయంలో వ్యత్యాసం ఉందా? లేదా? అన్నారు. అప్పులు చేసి పప్పూ బెల్లాల్లా చంద్రబాబు తమ కార్యకర్తలకు పంచిపెట్టారని ఆరోపించారు.