Jana Sena MLA Chirri Balaraju : జనసేన ఎమ్మెల్యే బ్యాంక్ ఖాతా నుంచి రూ.12లక్షలు మాయం.. చలానా పేరుతో ఫోన్‌కు లింక్ రాగానే..
Jana Sena MLA Chirri Balaraju : పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుపోయారు. ఎమ్మెల్యే బ్యాంక్ ఖాతా నుంచి రూ.12లక్షలు కొట్టేశారు..
- Harishth Thanniru
- Published On : March 22, 2026 / 11:38 AM IST
Cyber criminals
- జనసేన ఎమ్మెల్యేను బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు
- ఆర్టీఏ చలానా పేరుతో ఫోన్‌కు లింక్
- ఓపెన్ చేసిన కొద్దిసేపటికే విడతల వారిగా రూ.12లక్షలు మాయం
- పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు
- నిందితులను గుర్తించే పనిలో సైబర్ క్రైమ్ పోలీసులు
Jana Sena MLA Chirri Balaraju : సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. టార్గెట్ చేసుకున్న వ్యక్తుల ఫోన్లకు లింక్‌లు పంపించి.. దాన్ని ఓపెన్ చేయగానే అకౌంట్లలో డబ్బులు మొత్తం దోచేస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.. తాజాగా జనసేన ఎమ్మెల్యేకు సైబర్ నేరగాళ్లు బిగ్ షాకిచ్చారు. ఏకంగా రూ.12లక్షలు కొట్టేశారు.
ఏపీలోని పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుపోయారు. ఎమ్మెల్యే మొబైల్ ఫోన్ కు ఆర్టీఏ చలాన్ చెల్లించాలంటూ ఒక మెస్సేజ్ వచ్చింది. అది నిజంగానే ఆర్టీఏ వారు పంపించిన లింక్ అనుకొని ఎమ్మెల్యే ఆ లింక్ ను ఓపెన్ చేశారు.. ఆ తరువాత కొద్ది నిమిషాలకే ఆయన బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా రూ.12లక్షల నగదు డ్రా అయినట్లు మెసేజ్ లు రావడంతో ఎమ్మెల్యే షాక్ కు గురయ్యారు. దీంతో తాను మోసపోయానని గ్రహంచి జీలుగుమిల్లు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జంగారెడ్డిగూడెంలోని ఇండస్ లాండ్ బ్యాంకులో ఉన్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఖాతా నుండి సైబర్ నేరగాళ్లు రూ.12లక్షలు కొట్టేశారు. ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు, సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులను పట్టుకునేందుకు విచారణ చేస్తున్నారు. సామాన్యులకే కాకుండా ఏకంగా ప్రజాప్రతినిధులకు ఇటువంటి చేదు అనుభవం ఎదురవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
సైబర్ నేరగాళ్లు కొత్తకొత్త మార్గాల్లో ప్రజలను మోసం చేస్తూ వారి బ్యాంక్ ఖాతాల్లోని డబ్బును దోచేస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వం, అధికారిక సంస్థల పేరుతో లింక్ లు పంపించి బురిడీ కొట్టిస్తున్నారు. అయితే, ప్రభుత్వం, అధికారిక సంస్థల పేరుతో వచ్చే అనుమానాస్పద లింక్ లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దని, ఇటువంటి మోసాలకు గురైతే వెంటనే 1930 నెంబర్ కు ఫిర్యాదు చేయాలని పోలీసులు ఈ సందర్భంగా ప్రజలను హెచ్చరిస్తున్నారు.
