Preliminary report to CM Chandrababu Naidu on Tirupati stampede incident
CM Chandrababu Naidu: తిరుమల తిరుపతి దేవస్థానంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైకుంఠద్వార దర్శనం టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులు మరణించగా.. మరో 48మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని తిరుపతిలో రుయా, స్విమ్స్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన జరిగిన కొద్దిసేపటికే డీజీపీ, టీటీడీ ఈవో, తిరుపతి కలెక్టర్, ఎస్పీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఘటన జరిగిన తీరు, కారణాలు ఏమిటి.. ప్రస్తుత పరిస్థితి ఎలాఉంది అనే విషయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైకుంఠద్వార దర్శనం టోకెన్ల కోసం పెద్ద సంఖ్యలో భక్తులొస్తారని తెలిసీకూడా, అందుకు తగ్గట్లు ఎందుకు ఏర్పాట్లు చేయలేదని అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Tirupati Stampede : తిరుపతిలో తొక్కిసలాటకు కారణం ఏంటంటే.. మృతులు వీరే, మాజీ సీఎం జగన్ ఏమన్నారంటే..
తిరుపతిలో తొక్కిసలాట ఘటనకు సంబంధించి అధికారులు ప్రాథమిక నివేదికను సీఎం చంద్రబాబు నాయుడుకు అందజేసినట్లు తెలిసింది. ఇదులో ఘటనకు ప్రధాన కారణాలను పేర్కొన్నట్లు సమాచారం. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. తొక్కిసలాట జరిగినా డీఎస్పీ సరిగా స్పందించలేదని నివేదికలో వెల్లడించినట్లు తెలిసింది. ఎస్పీ వెంటనే సిబ్బందితో సంఘటన స్థలంకు చేరుకొని భక్తులకు సహాయం అందించారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, అంబులెన్స్ వాహనాన్ని డ్రైవర్ టికెట్ కౌంటర్ బయట పార్క్ చేసి వెళ్లిపోయాడు. డ్రైవర్ 20 నిమిషాల పాటు అందుబాటులోకి రాలేదు. డీఎస్పీ, అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే భక్తులు చనిపోయారని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ఇప్పటికే డీఎస్పీ తీరుపై ఎస్పీ సుబ్బారాయుడుకు కలెక్టర్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
Also Read: Tirupati Stampede : తిరుమల ఘటనపై ప్రధాని మోదీ, రాహుల్ దిగ్భ్రాంతి.. ఇవాళ తిరుపతికి చంద్రబాబు
ఇదిలాఉంటే.. ఘటన జరిగిన విషయం తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్ లను తిరుపతి వెళ్లాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో వారు వెంటనే తిరుపతి చేరుకొని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టారు. ఇవాళ మధ్యాహ్నం 12గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతికి వెళ్లనున్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిస్తారు. అనంతరం అధికారులతో ఘటన జరిగిన తీరు, తాజా పరిస్థితులపై సమీక్షించనున్నారు.
మృతులు వీరే..
తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతిచెందారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. విశాఖపట్టణంకు చెందిన రజనీ (47), శాంతి (34), లావణ్య (40), నర్సీపట్నంకు చెందిన నాయుడు బాబు (51), కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన నిర్మల (50), తమిళనాడు సేలం ప్రాంతానికి చెందిన మల్లిగ (49) మృతిచెందారు.