pulivendula tdp leader satish reddy joins ysr congress party
SV Satish Kumar reddy: తెలుగు దేశం పార్టీకి షాక్ తగిలింది. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. పార్టీ కండువాతో సతీష్ రెడ్డిని సీఎం జగన్ స్వాగతించారు.
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, పలువురు స్ధానిక నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌పై విమర్శలు గుప్పించారు.
చంద్రబాబు పెద్ద అవకాశవాది: సతీష్ కుమార్ రెడ్డి
చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ ప్రాభవం కోల్పోతోందని, ఆయన పెద్ద అవకాశవాదని సతీష్ కుమార్ రెడ్డి విమర్శించారు. తెలుగుదేశం పార్టీని వ్యాపార సంస్థలా నారా లోకేశ్ నడుపుతున్నారని ఆరోపించారు. ”27 ఏళ్లు టీడీపీకి పని చేశా. పులివెందులలో టీడీపీ బలోపేతానికి పాటుపడ్డాను. నా కష్టానికి ప్రతిఫలం ఇవ్వకుండా అవమానించారు. నాకు జరిగిన అవమానంతో 2020 లోనే టీడీపీని వదిలి బయటకి వచ్చాను. 27 ఏళ్లు వైఎస్ కుటుంబంతో పోరాటం చేశా, ఇబ్బందులు పెట్టా.. అయినా cm జగన్ పెద్ద మనసుతో నన్ను పార్టీ లోకి ఆహ్వానించారు. నాలుగేళ్లు నన్ను టీడీపీ పట్టించుకోలేదు.. ఇప్పుడు రాయబారం పంపుతున్నారు. చంద్రబాబు పెద్ద అవకాశ వాది.. చంద్రబాబు నాయకత్వం పార్టీలో తగ్గిపోతుంది. వ్యాపార సంస్థలా పార్టీని లోకేశ్ నడుపుతున్నాడు. నాలాంటి చాలా మంది సీనియర్లు ఇబ్బంది పడుతున్నారు. ఇకపై జగన్ తో నా ప్రయాణం ఉంటుంది. నా అవసరం జగన్ కు ఒక్క శాతం కూడా లేదు. ఆయన ఏ బాధ్యత అప్పగించినా పని చేస్తా. నాకు ఎలాంటి డిమాండ్స్ లేవ”ని సతీష్ కుమార్ రెడ్డి అన్నారు.
Also Read: జనసేన పార్టీకి బిగ్ షాక్.. వైసీపీలోకి హరిరామజోగయ్య కొడుకు