క్షణక్షణం ఉత్కంఠ.. పులివెందుల ఎపిసోడ్‌లో ట్విస్టులు‌.. ఏం జరగబోతోంది?

ఓవరాల్‌గా పులివెందుల బైపోల్‌.. థ్రిల్లర్‌ సినిమాలను తలపిస్తోంది. ఫలితాలపై అంచనా వేయలేని పరిస్థితి కనిపిస్తోంది.

Chandrababu-Jagan

క్షణక్షణం ఉత్కంఠ.. సవాళ్లు, ప్రతిసవాళ్లు.. ఆరోపణలు, అంతకుమించి ఆయుధాల్లాంటి మాటలు ! జరుగుతోంది జడ్పీటీసీ ఎన్నికలా.. అసెంబ్లీ ఎన్నికలా అని అవాక్కై.. ఆంధ్రప్రదేశ్‌ అంతా అటు వైపు చూసేంత టెన్షన్‌. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ బైపోల్ ఎపిసోడ్‌లో.. కనిపించిన ట్విస్టులు అన్నీ ఇన్నీ కావు. ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా అనిపించింది. ఎట్టకేలకు ఇది క్లైమాక్స్‌కు వచ్చేసింది. పులివెందుల మే సవాల్ అంటున్న రెండు పార్టీల్లో సత్తా చాటేదెవరు.. గెలిచేదెవరు, నిలిచేదెవరు.. పరిణామాలు చెప్తుందేంటి?

ఒక్క జడ్పీటీసీ ఎన్నిక ఇంత హాట్‌గా సాగుతుందని.. ఇన్ని ట్విస్టులు ఉంటాయని.. అసెంబ్లీ ఎన్నికలనే మర్చిపోయేలా చేస్తుందని.. ఎవరూ ఊహించి ఉండరు బహుశా ! కడప జిల్లా అంటేనే వైఎస్ ఫ్యామిలీ కంచుకోట. అక్కడ గెలిచి ఫ్యాన్ పార్టీ స్విచ్‌ నొక్కేయాలని టీడీపీ.. తగ్గింది సీట్లే జనంలో బలం కాదు అని అని ప్రూవ్‌ చేసుకునేందుకు వైసీపీ.. రెండు పార్టీల పట్టుదలతో..
చిన్నపాటి యుద్ధమే కనిపించింది కడప జిల్లాలో ! పార్టీ అధినేతలే ప్రత్యేకంగా దృష్టి పెట్టిన ఉపఎన్నిక.. పార్టీలో కీలక నేతల నుంచి మంత్రుల వరకు ప్రచారం దిగిన బైపోల్. దీంతో ఎవరు గెలుస్తారు?

ఏ పార్టీ ఎలాంటి సందేశం పంపిస్తుంది.. అసలు జనం అభిప్రాయం ఎలా ఉండబోతుందని.. ఆంధ్రప్రదేశ్ అంతా ఆసక్తిగా గమనిస్తోంది. జిల్లాలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా కనిపిస్తుండడంతో పోలీసులు అలర్ట్‌గా ఉన్నారు. దాదాపు 14వందల మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రచారం ఓ రేంజ్‌లో సాగగా.. ఓటర్‌ తీర్పు ఎలా ఉండబోతుందన్న ఆసక్తి రాష్ట్రమంతా కనిపిస్తోంది.

పులివెందుల వైసీపీ జడ్పీటీసీ మహేశ్వర్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో బై పోల్‌ వచ్చింది. దీంతో సానుభూతి అస్త్రంతో మహేశ్వర్‌రెడ్డి కొడుకు హేమంత్‌కుమార్‌రెడ్డితో వైసీపీ నామినేషన్ వేయించింది. టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ 10వేల 6వందల ఓట్లు ఉన్నాయ్‌.

బరిలో మొత్తం 11 మంది
మొత్తం 11 మంది బరిలో ఉన్నారు. పులివెందుల స్థానంపై.. రెండు పార్టీల అధినేతలు ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు.. పోల్‌ మేనేజ్‌మెంట్‌తో పాటు ప్రతీదానిపై ఎప్పటికప్పుడు ఆరా తీశారు. టీడీపీ అభ్యర్థి తరఫున మంత్రులు, కీలక నేతలంతా ప్రచారంలో కనిపించగా.. వైసీపీ తరఫున ఎంపీ అవినాశ్‌రెడ్డి భారం అంతా భుజాల మీదకు ఎత్తుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల టైమ్‌ల వై నాట్ కుప్పం అంటూ వైసీపీ శ్రేణులు హడావుడి చేస్తే.. ఇప్పుడు వై నాట్ పులివెందుల అంటూ టీడీపీ దూకుడు మీద కనిపించింది.

బైపోల్‌ను వైసీపీ డూ ఆర్ డైలాగా తీసుకుంటే.. జగన్‌ కంచుకోటలో గెలిచి.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కేడర్‌కు బలమైన సందేశాన్ని పంపించాలనే కసితో టీడీపీ కనిపించింది. ఇక జడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారంలో కనిపించిన ట్విస్టులు అన్నీ ఇన్నీ కావు. వివేకా మర్డర్‌ చుట్టూనే రాజకీయం అంతా తిరిగింది. వైసీపీని కార్నర్ చేస్తూ.. ఈ ఘటనను అస్త్రంగా మార్చుకొని టీడీపీ దూకుడు మీద కనిపించింది. పైగా వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ కూడా అభ్యర్ధిగా బరిలో ఉండడం.. బైపోల్‌ను మరింత ఇంట్రస్టింగ్‌గా మార్చింది. ఇక అటు కాంగ్రెస్ తరఫున షర్మిల సన్నిహితుడు పోటీ చేస్తున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య.. ఉప ఎన్నిక పరిణామాలు చూస్తుంటే భయంగా ఉందని.. వైసీపీని టార్గెట్‌ చేస్తూ వివేకా కూతురు సునీతా చేసిన కామెంట్స్‌.. మరింత కలకలం పుట్టించాయ్‌. దీంతో రిజల్ట్ ఎలా ఉండబోతుందా అని రాష్ట్రమంతా ఆసక్తిగా గమనిస్తోంది.

జడ్పీటీసీ ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు.. అదే స్థాయిలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశాయనే గుసగుసలు వినిపిస్తున్నాయ్‌. ఎప్పుడూ లేని విధంగా టీడీపీ, వైసీపీ ఓటర్లకు భారీగానే ముట్టజెప్తున్నారనే టాక్ నడుస్తోంది. ఇక ప్రచారం సమయంలో జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకొని.. పోలింగ్ టైమ్లో ఎలాంటి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

Also Read: యుక్రెయిన్‌లో యుద్ధం, భారత్‌పై ట్రంప్‌ టారిఫ్‌ల వేళ.. యుక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫోనులో మాట్లాడిన మోదీ.. ఏం జరుగుతోంది?

పులివెందులలో మొత్తం 15 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. 7వందల మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ రూటులో సీఐ స్థాయి అధికారి, పోలింగ్ కేంద్రాల దగ్గర ఎస్ఐని ఏర్పాటు చేశారు. ఇక అటు ఒంటిమిట్ట ఉప ఎన్నిక హాట్‌హాట్‌గా సాగుతోంది. టీడీపీ నుంచి ముద్దు క్రిష్ణారెడ్డి, వైసీపీ నుంచి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి పోటీ చేస్తుండగా.. అభ్యర్థుల తరఫున రెండు పార్టీల నుంచి హేమాహేమీలు ప్రచారం నిర్వహించారు. ఇక్కడ మొత్తం 13 పంచాయతీలు, 24వేల 6వందల ఓట్లు ఉండగా.. మొత్తం 11 మంది బరిలో ఉన్నారు.

ఓవరాల్‌గా పులివెందుల బైపోల్‌.. థ్రిల్లర్‌ సినిమాలను తలపిస్తోంది. ఫలితాలపై అంచనా వేయలేని పరిస్థితి కనిపిస్తోంది. ఐతే జడ్పీటీసీ బైపోల్‌ నోటిఫికేషన్‌కు ముందు టీడీపీ బలం అంతంత మాత్రంగానే ఉన్నా.. ఆ తర్వాత సైకిల్ పార్టీ ఒక్కసారిగా పుంజుకుందనే ప్రచారం జరుగుతోంది. ఇది వైసీపీని టెన్షన్ పెడుతోంది. వివేకా హత్య కేసు ఎపిసోడ్‌ వైసీపీకి కచ్చితంగా ఇబ్బంది పెట్టడంతో పాటు.. అభ్యర్థులు ఎక్కువగా ఉండడం.. షర్మిల సన్నిహితుడు కూడా బరిలో ఉండడంలాంటి పరిణామాలు.. ఫ్యాన్ పార్టీకి షాక్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయ్‌.

ఏమైనా వరుస అరెస్ట్‌లతో పాటు.. లిక్కర్ స్కామ్ ఎపిసోడ్‌తో ఇబ్బందుల్లో ఉన్న టైమ్‌లో.. పులివెందుల జడ్పీటీసీ బైపోల్‌తో వైసీపీకి మరో అగ్నిపరీక్ష ఎదురైంది. ఇప్పుడు ఫ్యాన్ పార్టీ కచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి. ఓడిపోతే.. సొంత జిల్లాలో జగన్‌ పట్టు నిలుపుకోలేక పోయారనే ప్రచారం రాష్ట్రమంతా వినిపించే చాన్స్ ఉంటుంది. ఇలాంటి పరిణామాల మధ్య పులివెందుల ఓటర్ తీర్పు ఎలా ఉంటుందన్నది సస్పెన్స్‌గా మారింది.