Rain Alert : ఏపీకి రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ఆ సమయాల్లో బయటకు రావొద్దంటూ..
Rain Alert : ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
- Harishth Thanniru
- Published On : March 30, 2026 / 08:12 AM IST
Heavy rains likely in AP today
- ఏపీలో పగలు ఎండలు.. సాయంత్రం వానలు
- ఇవాళ పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు చాన్స్
- పిడుగులు పడే అవకాశం
Rain Alert : ఏపీలో విచిత్ర వాతావరణం నెలకొంటుంది. పగటి పూట భానుడు ప్రతాపం చూపిస్తుండగా.. సాయంత్రం సమయాల్లో ఉరుములు, మెరుపులతో వరుణుడు విరుచుకుపడుతున్నాడు. గత వారం రోజులుగా ఏపీలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రజలు ఎండల వేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నా.. అదే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా.. ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది.
బంగాళాఖాతంలో గతకొద్దిరోజులుగా ద్రోణి వాతావరణం కొనసాగుతోంది. అది ఆవర్తనంగా, అల్పపీడనంగా మారట్లేదు. అండమాన్ సముద్రం, కేరళ పక్కన కూడా ద్రోణి వాతావరణం ఉంది. ఇవన్నీ ఏపీలో వర్షాలు పడేందుకు అవకాశాలను పెంచుతున్నాయి. బంగాళాఖాతంలో ఈదురుగాలుల వేగం గంటకు 44 కిలోమీటర్లుగా ఉంది. ఏపీ తీర ప్రాంతంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.
ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. పలు జిల్లాల్లో పిడుగులుకూడా పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇవాళ ఏపీలోని ప్రకాశం, మార్కాపురం, నంద్యాల, చిత్తూరు, అనంతపురంతోపాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గంటలకు 40నుంచి60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, పిడుగులు, వర్షం, ఈదురుగాలులు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు సురక్షితమైన భవనాల్లో తలదాచుకోవాలని, పిడుగులు పడే అవకాశం ఉన్నందున బహిరంగ ప్రదేశాల్లో నిలబడరాదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అంతేకాదు.. ఇంట్లో ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులను వాడటం తగ్గించాలని సూచించారు. మరోవైపు.. ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఆ సమయాల్లో విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్ లు వద్ద, చెట్ల కింద ఉండొద్దని, ఆ సమయాల్లో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచించారు.
