AP Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. 24 గంటలు అప్రమత్తం.. ఎవరూ బయటకు రావొద్దు.. తీవ్ర హెచ్చరిక!

AP Rain Alert : ఏపీ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం.. రానున్న 24 గంటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.

AP Rain Alert

  • ఏపీకి వర్ష సూచన.. 24 గంటలు అప్రమత్తం
  • ఛత్తీస్‌గఢ్‌పై తీవ్ర వాయుగుండం ప్రభావం
  • పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

AP Rain Alert : వర్షాలతో జాగ్రత్త.. బయటకు ఎవరూ రావొద్దు.. రానున్న 24 గంటల్లో ఏ క్షణమైన భారీ వర్షం పడొచ్చు.. ఆంధ్రప్రదేశ్‌లో రానున్న 24 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.

ఛత్తీస్‌గఢ్‌పై ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయి. గురువారం (జూలై 30)న పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలైన పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మరో 13 జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. మార్కాపురం, నెల్లూరు, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడా జల్లులు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

Read Also : Speed Post New Rules : ఆగస్ట్ 1 నుంచి స్పీడ్ పోస్ట్ కొత్త రూల్స్.. ఏవి డాక్యుమెంట్స్? ఏవి పార్శిల్స్? కొత్త ఛార్జీలు ఎంతంటే..

రాష్ట్రంలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు :
ఇప్పటికే, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో జోరుగా వర్షాలు పడుతున్నాయి. అమలాపురంలో అత్యధికంగా 72.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కంకిపాడులో 67.2 మి.మీ నమోదు కాగా పెనమలూరులో 64.6 మి.మీ. వర్షం కురిసింది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షాలు కురిశాయి.

వర్షాలు, ఈదురుగాలలతో రాష్ట్ర ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ సమీపంలో ఉండొద్దని, తెగిపోయిన విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. పిడుగులు పడే సమయంలో బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచనలు చేసింది.

సముద్రంలో అలలు ఉధృతంగా ఉండే అవకాశం ఉందని, మత్స్యకారులు చిన్న పడవలతో సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ కోరింది.